Begin typing your search above and press return to search.

అధికారంలోకి వ‌స్తాం..పోలీసుల సంగ‌తి చూస్తాం

By:  Tupaki Desk   |   8 Jan 2018 12:01 PM GMT
అధికారంలోకి వ‌స్తాం..పోలీసుల సంగ‌తి చూస్తాం
X
సుదీర్ఘ‌కాలం త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత జ‌గ్గారెడ్డి తాజాగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై స‌హ‌జ‌న శైలిలో విరుచుకుప‌డ్డారు. అదే స‌మయంలో పోలీసుల‌కు సంచ‌ల‌న బెదిరింపులు చేశారు. గాంధీభ‌వ‌న్‌ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మండిప‌డ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే జైల్లో పెడుతున్నారని ఆక్షేపించారు. మంద కృష్ణ మాదిగ మాదిగల హక్కులకై - ఏబీసీడీ వర్గీకరణకు పోరాడుతుంటే ఈ ప్రభుత్వం రెండు సార్లు జైల్లో పెట్టిందని మండిప‌డ్డారు. మందకృష్ణ మాదిగకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

టీఆర్ ఎస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నోరు మెడపకపోవడం బాధాకరమ‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం మాదిగలకు వ్యతిరేకమ‌ని..మాదిగ‌ల‌కే కాదు.. కేసీఆర్‌ పాలన ప్రజలందరికీ వ్యతిరేకమ‌ని అన్నారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరించడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే రైతులపై ప్ర‌భుత్వం కపట ప్రేమ ప్రదర్శిస్తోంద‌ని మండిప‌డ్డారు. మూడేళ్లుగా ప్రగతిభవన్ కేంద్రంగా ప్రకటనలకు ప‌రిమితమైన కేసీఆర్ ..ఇప్పుడు ఎన్నికల కోసమే రైతుల జపం చేస్తున్నారని అన్నారు. రైతుకు కడుపు నిండా అన్నం పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదని అన్నారు. యువకులను - మహిళల్ని - అన్ని సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేస్తోంద‌ని ఆక్షేపించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. కొందరు పోలీసు అధికారులు టీఆర్ ఎస్ పార్టీకి చంచాలుగా మారారని...కాంగ్రెస్ నేతలపై పోలీసులతో అక్రమ కేసులు పెడుతున్నార‌ని పున‌రుద్ఘాటిస్తూ...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల సంగతి చూస్తామ‌ని హెచ్చరించారు.