Begin typing your search above and press return to search.

ఇద్దరు సరిపోరని.. మూడో పెద్దాయన అధ్యక్ష రేసులోకి వచ్చేశాడు

By:  Tupaki Desk   |   22 Sep 2022 6:30 AM GMT
ఇద్దరు సరిపోరని.. మూడో పెద్దాయన అధ్యక్ష రేసులోకి వచ్చేశాడు
X
ఎంత ప్రయత్నం చేసినా.. ప్రజాదరణను సొంతం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో పరాజయం తర్వాత నుంచి ఏడాదికేడాది కాంగ్రెస్ పరపతి అంతకంతకూ తగ్గట్లే కాదు.. అధికారాన్ని సొంతం చేసుకునే విషయంలో తిప్పలు పడుతోంది. పార్టీకి రథసారధిగా ఉండేది ఎవరన్న విషయంపై నడుస్తున్న చర్చ అంతా ఇంతా కాదు. పార్టీకి అన్నీ తామైనట్లుగా వ్యవహరించే గాంధీ ఫ్యామిలీకి సంబంధించి రాహుల్ కు పార్టీ అధ్యక్ష పదవి మీద ఆసక్తి లేకపోవటం తెలిసిందే.

దీంతో.. ఎన్నిసార్లు చెప్పినా.. అధ్యక్ష స్థానం పోటీకి ఆయన నో అంటే నో చెప్పేస్తున్నారు. దీంతో.. ఆరోగ్యం సరిగా లేకున్నా కూడా సోనియాగాంధీనే పార్టీ పగ్గాలు పట్టుకోక తప్పని పరిస్థితి. ఇలాంటివేళ.. రాహుల్ వైపు మరోసారి చూడటం.. ఆయన నో అంటే నో అనేయటంతో ఇప్పుడు పార్టీకి అధ్యక్ష ఎన్నికల్ని నిర్వహించాలని నిర్ణయించారు.
దీంతో.. కాంగ్రెస్ లో కాక మొదలైంది.

ఇప్పటివరకు పార్టీ అధ్యక్ష స్థానానికి సీనియర్ నేత కమ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లెత్ నిలిచారు. ఆయనకు ముందుగా రాజ్యసభ సభ్యుడు.. తన మాటలతో తరచూ తన మేధావితనాన్ని చాటే శశిథరూర్ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. పోటీ ఈ ఇద్దరి మధ్యనే ఉన్నా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబరు 30 కాగా.. తుది పోటీలో ఎవరు ఉంటారన్నది తేలాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ రేసులోకి వచ్చారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమ్ కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజా. అధ్యక్ష పోటీకి ఇద్దరే చేయాలా? మరొకరు చేయకూడదా? అంటూ ప్రశ్నించిన ఆయన.. తాను కూడా రేసులోకి వచ్చిన వైనాన్ని తెలిపారు. ఒక్కరికి ఒక్కటే పదవి అన్న సూత్రాన్ని చూస్తే.. అశోక్ గెహ్లాత్ కానీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది.

అధ్యక్ష పదవికి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న దిగ్విజయ్.. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఉంటే బరిలో కి రావొచ్చన్న వ్యాఖ్య చేశారు. అదే సమయంలో పోటీకి ఆసక్తి లేని వారిని బలవంతం చేయొద్దన్నారు.

ఇప్పటివరకు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఇద్దరు ప్రముఖులు ఉండగా.. తాజాగా డిగ్గీ రాజా ఎంట్రీ ఇవ్వటం.. సంచలన వ్యాఖ్యలు చేయటంతో.. పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముగిసే నాటికి మరెన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.