Begin typing your search above and press return to search.

సినీ నటి సుమలతకు నో టికెట్‌.. బీజేపీలోకేనట..

By:  Tupaki Desk   |   6 March 2019 7:00 AM GMT
సినీ నటి సుమలతకు నో టికెట్‌.. బీజేపీలోకేనట..
X
సినీ నటి సుమలత రాజకీయ భవిష్యత్ అయోమంగా మారింది. ఆమె భర్త - కర్ణాటక మాజీ మంత్రిగా పనిచేసిన అంబరీష్‌ మరణం తరువాత కర్ణాటకలోని మండ్య నుంచి పోటీ చేసేందుకు సుమలత సిద్ధమయ్యారు. అయితే ఆమధ్య ఆమె పార్టీ మారుతారన్న వార్తలు జోరుగా వచ్చాయి. ఆనంతరం ఆమె తమ కుటుంబం చిరకాలంగా కాంగ్రెస్‌లోనే ఉంటూ వస్తోందని, అందువల్ల తాను కాంగ్రెస్‌ పార్టీని వీడేదిలేదని సుమలత సమాధానమిచ్చారు. కానీ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పరిమాణాలు చూస్తే ఆమె పార్టీ మారడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.

కర్ణాటకలోని మండ్య లోక్‌ సభ నుంచి గత ఎన్నికల్లో అంబరీష్‌ ఎన్నికయ్యారు. ఆయన మరణం తరువాత ఆ స్థానంలో ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆమె సతీమణి - సినీ నటి అయిన సుమలతనే ఆ స్థానంలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటారనే వార్తలు వచ్చాయి. సుమలత సినీ నటి కావడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆమెకు ప్రజల్లో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఆమె మాండ్య స్థానంలో పోటీ చేసినా గెలుపొందే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.

కానీ మండ్య నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీఎస్‌ వదులుకోవడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడిని బరిలోకి దించేందుకు యత్నిస్తోంది. ఆయన కుమారుడు నిఖిల్‌ కూడా సినీ నటుడు కావడంతో పాటు గౌడ సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గం కావడంతో నిఖిల్‌ గెలుపుపై ఆశలు చిగురిస్తున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ చార్జి సిద్ధరామయ్య సైతం మండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌ కు వదిలేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఆశలు పెట్టుకున్న సుమలత పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో సుమలత బీజేపీలోకి మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై సుమలత ఎలా స్పందిస్తారోనని కర్ణాటకలో ఆసక్తి నెలకొంది.