Begin typing your search above and press return to search.

పెట్రో మంట.. మోడీకి సెగ పుట్టిస్తున్నారే..

By:  Tupaki Desk   |   12 Sept 2018 5:10 PM IST
పెట్రో మంట.. మోడీకి సెగ పుట్టిస్తున్నారే..
X
పెట్రోమంటలు ఇప్పుడు దేశంలో చిచ్చు రేపుతున్నాయి. 90 రూపాయలకు చేరువవుతున్న ధరలతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కనీసం వ్యాట్ తగ్గించడమో లేక వేరే ఏదైనా ప్రత్యామ్మాయ చర్యలు తీసుకోకుండా సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడుతున్నారు.

కానీ అధికార బీజేపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం తాము ఘన కార్యం చేశామని.. కాంగ్రెస్ కంటే తక్కువ శాతమే పెంచామని పలు లెక్కలను విడుదల చేసింది. ఇప్పుడీ లెక్కలను చూసి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2009 వరకూ పెట్రోల్ ధరలు 42 శాతం పెరిగాయని.. ఆ తర్వాత 2009-14 వరకూ ఏకంగా 83.17 శాతం పెరిగాయని బీజేపీ పేర్కొంటోంది. అదే సమయంలో బీజేపీ గద్దెనెక్కిన 2014 నుంచి 2018 సెప్టెంబర్ వరెకూ కేవలం 28శాతం మాత్రమే ధరలు పెరిగాయని ప్రచారం చేసుకుంటోంది.

దీనిపై సామాన్యులు, కాంగ్రెస్ ధీటుగా సమాధానం ఇస్తోంది. బీజేపీ నేతలు చెబుతున్న లెక్కలను లెక్కతోనే కొడుతున్నారు. దేశంలో 2004లో 33.71 రూపాయలకు లీటర్ పెట్రోల్ దొరికితే.. అప్పుడు క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 36 డాలర్లు ఉందని.. అదే సమయంలో 2018లో క్రూడాయిల్ ధరలు కేవలం 34 శాతం తగ్గినా కూడా ధరలను మాత్రం బీజేపీ ప్రభుత్వం తగ్గించకపోగా పెంచిందని రూ. 80.73లకు పెంచి పన్నుల మీద పన్నులు వేస్తోందని కాంగ్రెస్ సహా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో క్రూడాయిల్ ధరలకు తగ్గట్టు పెంచారని.. కానీ ఇప్పుడు క్రూడాయిల్ ధరలు 34శాతం తగ్గినా బీజేపీ ప్రభుత్వం దారుణంగా పెట్రో ధరలు పెంచిందని ఆరోపిస్తున్నారు.. చమురు ధరలు తగ్గితే పెట్రో ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు బీజేపీ మోసంపై లెక్కలు కూడా విడుదల చేశారు. ఇప్పుడీ పెట్రో మంటలపై బీజేపీ నాటకాలను నెటిజన్లు ఎండగడుతున్నారు.