Begin typing your search above and press return to search.

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు స్వ‌స్థి?.. క‌మ‌ల్ నాథ్ చేతికి కాంగ్రెస్ ప‌గ్గాలు!

By:  Tupaki Desk   |   9 Aug 2021 4:30 PM GMT
వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు స్వ‌స్థి?.. క‌మ‌ల్ నాథ్ చేతికి కాంగ్రెస్ ప‌గ్గాలు!
X
దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా నిలిచిన కాంగ్రెస్‌లో ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా పార్టీ అడుగులు వేస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. నెహ్రూ హ‌యాం నుంచి పార్టీని ప‌రిశీలిస్తే.. గాంధీల వార‌సులే పార్టీని న‌డిపిస్తున్నారు. మ‌ధ్య‌లో సీతారాం కేస‌రి(రాజీవ్ మ‌ర‌ణం నేప‌థ్యంలో) పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టినా.. ఆ వెంట‌నే.. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో గాంధీల కోడ‌లు సోనియా గాంధీ రంగంలోకి దిగి.. సుదీర్ఘ‌కాలం పార్టీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌లు వ‌హించారు. ఇక‌, ఆ త‌ర్వాత కొన్నాళ్లు రాహుల్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ(ఏఐసీసీ) అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. అయితే.. ఆయ‌న హ‌యాంలో పార్టీ పూర్తిగా జారుడు మెట్ల విన్యాసం చేయ‌డంతో.. స్వ‌యంగా తానే త‌ప్పుకొన్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో.. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు స్వ‌స్థి ప‌ల‌కాల‌ని పార్టీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఉత్త‌రాదికి చెందిన మాజీ ముఖ్య‌మంత్రికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈయ‌న నెహ్రూ-గాంధీల కుటుంబానికి అత్యంత ప్రియ‌మైన నాయ‌కు డని.. కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కే ఏఐసీసీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. 2024 ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌లోపేతం చేసేందుకు వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగుల్లో ఇది అత్యంత కీల‌క‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌ధానంగా బీజేపీకి గ‌ట్టి ప‌ట్టున్న ఉత్త‌రాదిలో ఆ పార్టీకి చెక్ పెట్టే నాయ‌కుడు, అంద‌రినీ క‌లుపుకొని పోయే నేత‌.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అత్యంత అవ‌స‌రమ‌ని.. భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఏఐసీసీ ప‌ద‌వి కోసం.. ముగ్గురు పేర్లు.. ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరిలో రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా చేసిన హ‌రియాణా నేత‌.. భూపీంద‌ర్ సింగ్ హూడా, జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గులాం న‌బీ అజాద్‌, అదేస‌మ‌యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్‌నాథ్ పేర్ల‌ను పార్టీ అధిష్టానం.. ఏఐసీసీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు ప‌రిశీల‌స్తోంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ మ‌రో మాజీ సీఎం దిగ్వ‌జ‌య్ సింగ్ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని అంటున్నారు.

అయితే.. ఏఐసీసీ ప‌గ్గాల కోసం ప‌రిశీల‌న‌లోఉన్న పేర్ల‌లో.. కొంద‌రు వృద్ధులు కాగా.. మ‌రికొంద‌రు కొన్నేళ్లుగా అధికారానికి కూడా దూరంగా ఉన్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిలో దిగ్వ‌జ‌య్ సింగ్ ద‌శాబ్ద‌కాలంగా ఎలాంటి ప‌దవిలోనూ లేరు. ఈ నేప‌థ్యంలో ఉన్న‌వారిలో బెస్ట్ అనద‌గిన నాయ‌కుడిగా క‌మ‌ల్‌నాథ్ పేరు వినిపిస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం సోనియాకు అత్యంత చేరువ‌గా ఉన్న నాయ‌కుల్లో క‌మ‌ల్ నాథ్ ఒక‌రుగా ఉన్నారు. అహ్మ‌ద్ ప‌టేల్ మృతి త‌ర్వాత‌.. సోనియాకు కీల‌క స‌ల‌హాదారుగా క‌మ‌ల్ నాథ్ నియ‌మితుల‌య్యారు. త‌ర‌చుగా ఈయ‌న ఢిల్లీ వెళ్ళ‌డం.. సోనియాతో భేటీ కావ‌డం.. వివిధ రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం తెలిసిందే.

ఇదేస‌మ‌యంలో ఇత‌ర నేత‌లు.. గులాం న‌బీ, భూపీంద‌ర్ యాద‌వ్‌ల‌ను ప‌రిశీలిస్తే.. వీరు పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరిట రాజ‌కీయం చేస్తూ ఉన్న విష‌యంతెలిసిందే. అయితే.. ఈ విష‌యంలో క‌మ‌ల్‌నాథ్ మాత్రం గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తూ.. అధిష్టానానికి.. అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్‌కు ఏఐసీసీ ప‌గ్గాలు ద‌క్క‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.