Begin typing your search above and press return to search.

ఆయ‌న‌ విష‌యంలో..కాంగ్రెసుకు భ‌య‌మా...ధైర్య‌మా?

By:  Tupaki Desk   |   4 July 2019 2:56 PM IST
ఆయ‌న‌ విష‌యంలో..కాంగ్రెసుకు భ‌య‌మా...ధైర్య‌మా?
X
కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి `అధికారికంగా` భార‌తీయ జ‌నతాపార్టీ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌నే విష‌యం....క‌నీస రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ఎవ‌రైనా...చెప్పేస్తారు. అయితే, ఆయ‌న విష‌యంలో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హార శైలి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి - బీజేపీకి చేరువైన ఆయ‌న బ‌హిరంగంగానే త‌న వైఖ‌రిని వ్య‌క్త‌ప‌రుస్తున్న‌ప్ప‌టికీ...కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం లీకుల‌తో స‌రిపెడుతున్నారే త‌ప్ప ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఓవైపు కోమ‌టిరెడ్డి త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న‌ - వివాదాస్ప‌ద కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్న త‌రుణంలో...ఆయ‌న‌పై వేటుకు రంగం సిద్ధమైందనే లీకులు త‌ప్ప‌...త‌గు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో త‌మ పార్టీకి ధైర్యం లేక‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతోందా....లేక కోమ‌టిరెడ్డి దూకుడుకు భ‌య‌ప‌డుతోందా అంటూ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

డైన‌మిక్ లీడ‌ర్‌ గా పేరొందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వివిధ సంద‌ర్భాల్లో తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇటీవల ఎమ్మెల్సీగా పోటీచేసి ఓటమిపాలైన గూడూరు నారాయణ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి దాడి - ప్రచార కమిటీ చైర్మన్‌ గా వున్న భట్టి విక్రమార్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలు - రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాపై చేసిన కామెంట్లు... బీజేపీనే టీఆర్ ఎస్ పార్టీ ప్రత్నామ్నాయమంటూ చేసిన వ్యాఖ్యలు...ఇలా కోమ‌టిరెడ్డి ఎక్క‌డా త‌గ్గ‌లేదు. గత మూడేళ్ళలో రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు అనేకం ఉన్న‌ప్ప‌టికీ పార్టీ స్పందించ‌లేదు. అయితే - ఇటీవ‌లే పార్టీ క్రమశిక్షణా సంఘం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాల‌ని ఆదేశించింది.

ఎట్ట‌కేల‌కు పార్టీ పెద్ద‌లు స్పందించ‌డంతో...పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడిన రాజగోపాల్ రెడ్డి తీరుతెన్నులపై విచారణ జరిపిన కోదండరెడ్డి సారథ్యంలోని టీపీసీసీ క్రమ శిక్షణా సంఘం ఈ మేర‌కు నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికలో రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు - వ్యవహరించిన తీరుపై కూడా పూర్తి వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ - పీసీసీ సారథి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలకు నివేదిక సమర్పించింది. అయితే, అధిస్టానానికి నివేదిక సమర్పించిన‌ప్ప‌టికీ....కోమ‌టిరెడ్డిపై చ‌ర్య‌లు లేక‌పోవ‌డం పార్టీ శ్రేణుల‌ను మ‌రింత గంద‌ర‌గోళ ప‌రుస్తోంది.