Begin typing your search above and press return to search.

శ్రీధ‌ర్‌ను ప‌క్క‌న పెట్టిన కాంగ్రెస్‌.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   28 Jun 2021 8:30 AM GMT
శ్రీధ‌ర్‌ను ప‌క్క‌న పెట్టిన కాంగ్రెస్‌.. రీజ‌నేంటి?
X
దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. గ‌తంలో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. ఫుల్లు తెలంగాణ వాదిగా.. ఆయ‌న‌కు పేరుంది. అంతేకాదు... ఆయ‌న తండ్రి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. శ్రీధ‌ర్‌బాబు యువ‌నేత‌గా ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న నాయ‌కుడు, వివాద ర‌హితుడు కూడా. అయితే.. తాజాగా జ‌రిగిన పీసీసీ నియామ‌కాల్లో ఆయ‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. క‌నీసం చిన్న ప‌ద‌విని కూడా ఆయ‌న‌కు కేటాయించ‌లేదు. దీంతో అసలు ఆయ‌న‌ను అధిష్టానం ప‌క్క‌న పెట్టేసిందా? లేక‌.. మున్ముందు..ఏదైనా ఇచ్చే అవ‌కాశం ఉందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

అయితే.. శ్రీధ‌ర్ బాబు విష‌యంలో కొన్ని రోజులుగా.. ఓ విమ‌ర్శ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న స‌తీమ‌ణి సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి శైల‌జా రామ‌య్య‌ర్‌.. తెలంగాణ ప్ర‌భుత్వంలో ప‌నిచేస్తున్నారు. చేనేత‌, టెక్స్‌టైల్స్‌, అపెర‌ల్ ఎక్స్‌పోర్ట్స్ పార్క్‌కు క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు టీఆర్ ఎస్ నేత‌లు.. శ్రీధ‌ర్‌బాబుకు ట‌చ్‌లో ఉన్నార‌ని.. ఆయ‌న ఎప్పుడైనా.. పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... ఈ వాద‌న‌ను శ్రీధ‌ర్‌బాబు స‌న్నిహితులు కొట్టిపారేస్తున్నా.. అధిష్టానం ఆయా అంశాల‌ను ముఖ్యంగా టీఆర్ ఎస్‌తో ఆయ‌న లోపాయికారీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నందునే ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, దుద్దిళ్ల రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌న తండ్రి శ్రీపాద‌రావు.. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా స‌మున్న‌త ప‌ద‌విని అలంక‌రించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఆయ‌నను మావోయిస్టులు హ‌త్య చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న శ్రీధ‌ర్ బాబుకూడా తండ్రిబాట‌లో న‌డిచి మంచి పేరుతెచ్చుకున్నారు. మంత్రిగా ప‌నిచేశారు. అయితే.. టీఆర్ ఎస్ తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన‌నాటి నుంచి కూడా శ్రీధ‌ర్‌బాబు ఆపార్టీ నేత‌ల‌తో ముఖ్యంగా యువ నేత కేటీఆర్‌కు ట‌చ్‌లో ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

బ‌హుశ అందుకేనే శ్రీధ‌ర్‌బాబు.. ఎంతోమంది పార్టీ సీనియ‌ర్లు టీఆర్ ఎస్‌పైనా, కేసీఆర్‌పైనా.. విమ‌ర్శ‌లు చేసినా.. ఆయ‌న మాత్రం మౌనంగా నే ఉన్నారు. ఒక్క‌మాట కూడా అన‌లేదు. ఇది కూడా ఆయ‌న టీఆర్ ఎస్‌కు ట‌చ్‌లో ఉన్నార‌నే వ్యాఖ్య‌ల‌ను బ‌లోపేతం చేసింది. మ‌రోవైపు.. కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ ఎస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వీరిలో పొన్నం ప్ర‌భాక‌ర్ కూడా ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే.. వీరిద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విమ‌ర్శ‌ల‌పై నోరు విప్పింది లేదు. అయితే.. క‌రీంన‌గ‌ర్‌లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వీరి గ‌మ్యం ఎటు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, త్వ‌ర‌లోనే ఏఐసీసీ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌నే నేప‌థ్యంలో అక్క‌డేమైనా.. వీరికి ప‌ద‌వులు ల‌భిస్తాయేమే చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.