Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్ష పెద్ద‌లంతా ఇప్పుడు గ‌ప్‌చుప్ అయ్యారే

By:  Tupaki Desk   |   15 Jan 2018 7:55 AM GMT
ప్ర‌తిప‌క్ష పెద్ద‌లంతా ఇప్పుడు గ‌ప్‌చుప్ అయ్యారే
X
తెలంగాణలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్లంతా ఇప్పుడు ఒక్క‌తాటికపై న‌డ‌వ‌డం త‌ప్ప‌దా? గ‌్రూపు రాజ‌కీయాల‌కు....శ్రుతిమించిన స్వాతంత్రానికి వేదిక అయిన కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి మాట‌ను ఇక‌నుంచి ఫాలో అవ్వాల్సిందేనా? ఆయన కెప్టెన్సీలోనే కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలకు వెళ్తుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ను మారుస్తారని కొద్దికాలం క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే మరోసారి పీసీసీ చీఫ్‌‌గా కొనసాగిస్తూ కాంగ్రెస్ నూత‌న రథ‌సార‌థి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పీసీసీ పదవి కోసం లాబీయింగ్‌ చేసుకుంటున్న నేతలపై నీళ్లు చల్లారు. ఉత్తమ్‌ను రెండోసారి కొనసాగించడంతో రాహుల్ గాంధీ మంచి సంకేతాలు ఇచ్చారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఇదే స‌మ‌యంలో త‌న నియామ‌కంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూనే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు.హైకమాండ్‌ నిర్ణయంతో ఉత్తమ్‌ దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. సంక్రాంతి తర్వాత కమిటీలను వేసేందుకు..ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఇప్ప‌టికే బీసీల్లో మెజార్టీ ఓట్లున్న గౌడ సామాజిక‌వ‌ర్గంతో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఇలాంటి భేటీలు ఉంటాయ‌ని తెలిపారు. పైగా ప్ర‌భుత్వం ఏర్పాటుచేస్తే తామేం చేస్తామో స్వ‌యంగా ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రోవైపు తెలంగాణ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికపుడు ఎండగడుతున్నారు. త‌ద్వారా త‌న ముద్ర వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇటు హైక‌మాండ్ నిర్ణయం, అటు ఉత్తమ్ దూకుడుతో కాంగ్రెస్‌లో ఇక ప‌ద‌వి కోసం పోరాటం ఉండ‌ద‌ని అంటున్నారు. అందుకే కొంద‌రు సీనియ‌ర్లు కూడా ఢీలాపడ్డారని... చేసేదేం లేక ఉత్తమ్‌తో క‌లిసి న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని చెప్తున్నారు.