Begin typing your search above and press return to search.

మునుగోడుపై కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   2 Aug 2022 5:25 AM GMT
మునుగోడుపై కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా?
X
తెలంగాణ‌లోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోకూడ‌ద‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి గెలుపొందారు. అయితే కోమ‌టిరెడ్డి బీజేపీ చేర‌డం ఖాయం కావ‌డంతో కాంగ్రెస్ అప్ర‌మ‌త్త‌మైంది.

రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామా కార‌ణంగా ఉప ఎన్నిక వ‌స్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ సిట్టింగ్ సీటును పోగొట్టుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించింది. అందులోనూ తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో మునుగోడులో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే ఆ ప్ర‌భావం సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ఉంటుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి పోయేదాకా ఎదురుచూడ‌కుండా ఇప్ప‌టి నుంచే కాయ‌క‌ల్ప చికిత్స‌కు దిగాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తాజా పరిణామాలపై ఆగ‌స్టు 1న‌ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీలో సమీక్ష జ‌రిపింది.

పార్టీ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో జరిగిన ఈ చర్చలో పార్టీ తెలంగాణ‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలు పాల్గొన్నారు.

రాజగోపాల్‌రెడ్డిపై బహిష్కరణ వేటువేయాలా? నచ్చజెప్పే ప్రయత్నం చేయాలా? అనే విషయంలో నేతలంతా సమాలోచనలు జరిపార‌ని స‌మాచారం. వ్యక్తిగత సంబంధాలకంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలని నేత‌లంతా నిశ్చ‌యించార‌ని తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే చాలా నిదానంగా వ్య‌వ‌హ‌రించామ‌ని.. ఇది స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైన‌ట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మ‌రింత న‌ష్ట‌పోకుండా ముందుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నేత‌లంతా ఒక ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

రాజ‌గోపాల్ రెడ్డిని పార్టీని వీడితే పార్టీ కేడ‌ర్ చెక్కుచెద‌ర‌కుండా చూసుకోవ‌డం ముఖ్య‌మని నేత‌లు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు పార్టీ కేడ‌ర్ ను స‌మ‌న్వ‌య‌ప‌రిచే బాధ్య‌త‌ను నల్గొండ జిల్లా ముఖ్యనేతలైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డిలకు అప్ప‌గించారు. అలాగే పార్టీని మునుగోడులో బ‌లోపేతం చేసేందుకు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క చెబుతున్నారు.