Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ గెలుపు అప్పుడే ఖ‌రారైంద‌ట‌!

By:  Tupaki Desk   |   19 May 2018 5:12 PM IST
కాంగ్రెస్ గెలుపు అప్పుడే ఖ‌రారైంద‌ట‌!
X
స‌స్పెన్స్ థిల్ల‌ర్ ను త‌లపించేలా రియ‌ల్ సినిమా దేశ ప్ర‌జ‌ల్ని విప‌రీతంగా ఆక‌ర్షించింద‌ని చెప్పాలి. ఎంత చ‌క్క‌గా స్క్రిప్ట్ చేసినా కూడా క‌ర్ణాట‌కలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతాలు తెర మీద ఇంత అత్య‌ద్భుతంగా పండ‌లేవ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బీజేపీకి బ‌లం లేకున్నా.. మోడీషాల మేజిక్ తో ఏదో ఒక అద్భుతం జ‌రుగుతుంద‌ని.. చివ‌రి క్ష‌ణంలో చోటు చేసుకునే ప‌రిణామాల‌తో మొత్తం మారిపోతుంద‌ని భావించినా అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

వాస్త‌వానికి బీజేపీ చేతులు ఎత్తేసింద‌ని.. య‌డ్డీ రాజీనామాకు సిద్ధ‌మ‌య్యార‌న్న విష‌యం బ‌ల‌ప‌రీక్ష‌కు కాస్త ముందుగానే తేలిపోయింది. బ‌ల‌ప‌రీక్ష‌కు కాస్త ముందుగా ఎప్పుడైతే య‌డ్డీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడితో మంత‌నాలు జ‌రిపారో.. అప్పుడే బీజేపీ ప‌ని అయిపోయింద‌ని తేలిపోయింది. అదే స‌మ‌యంలో.. య‌డ్డీ ముఖం విచారంతో ఉండ‌టం.. ఆయ‌న ముఖంలో ఎక్క‌డా ఆత్మ‌విశ్వాసం క‌నిపించ‌క‌పోవ‌టంతో ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది చాలామందికి అర్థ‌మైంది.

అయితే.. మోడీషాల మేజిక్ ఏమైనా ప‌ని చేస్తుంద‌న్న చిన్న ఆశ‌తో చాలామంది అతృత‌గా చూశారు. ఇదిలా ఉంటే.. బ‌ల‌ప‌రీక్షకు హాజ‌రైన కాంగ్రెస్ కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే విధాన‌సౌధ‌లోకి అడుగుపెట్టారో.. వారిని చూసినంత‌నే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చుట్టూ చేరి.. బీజేపీకి అనుకూలంగా ఎట్టి ప‌రిస్థితుల్లో ఓటు వేయొద్ద‌న్న విష‌యాన్ని వారికి బ‌లంగా చెప్ప‌టం క‌నిపించింది.

చివ‌ర‌కు వారు సైతం.. బ‌ల‌ప‌రీక్ష‌లో తాము బీజేపీకి ఓటు వేయ‌న‌న్న విష‌యాన్ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఎప్పుడైతే నిన్న‌టి నుంచి క‌నిపించ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క‌నిపించారో.. అప్పుడే బీజేపీ ఓట‌మి ఖ‌రారైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌.. చివ‌ర్లో య‌డ్డీ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. బ‌ల‌ప‌రీక్ష‌కు వెళ్ల‌కుండా.. ముందే చేతులు ఎత్తేసిన ఆయ‌న తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు చెప్ప‌టంతో.. అప్ప‌టివ‌ర‌కూ న‌రాలు తెగే ఉత్కంట‌తో ఉన్న నేత‌లంతా ఒక్క‌సారిగా రిలాక్స్ అయ్యారు. అయితే.. జ‌రిగేది ఏమిట‌న్న విష‌యాన్ని బీజేపీ ఎంపీ శోభా ఊహించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. అసెంబ్లీలోకి వెళ్లే ముందు ఆమె మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో ప్ర‌తి నిర్ణ‌యం అద్భుతం.. సంతోష‌మని వ్యాఖ్యానించారు. దీనికి త‌గ్గ‌ట్లే.. య‌డ్డీ త‌న ఓట‌మిని అంగీక‌రించ‌టంతో.. క‌ర్ణాట‌క అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఒక అద్భుత‌మైన ఘ‌ట్టం న‌మోదైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.