Begin typing your search above and press return to search.

విద్యార్ది నేతలకు టిక్కెట్లు !

By:  Tupaki Desk   |   10 Oct 2018 3:40 PM IST
విద్యార్ది నేతలకు టిక్కెట్లు !
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రోజురోజుకు రసకందాయనంలో పడుతున్నాయి. 105మంది అభ్యర్దుల ప్రకటనలతో - బహిరంగ సభలు - సమావేశాలతో తెలంగాణ రాష్ట్ర సమితి మంచి జోరు మీద ఉంది. అధికార పక్షాన్ని ఎదురుకునేందుకు ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు ఇంకా చర్చలలోనే మునిగి తేలుతున్నాయి. ఒకటి రెండు రోజులలో మహాకూటమి పక్షాల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉంది. 119 స్దానాలలో ఎక్కువ స్ధానాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోటి చేసే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సిపీఐ తమకు కేటాయించిన సీట్లలో అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ జన సమితి విద్యార్ది నాయకులను తన అభ్యర్దులుగా నిలపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలోని ఉస్మానీయ విశ్వవిద్యాలయం - కాకతీయ విశ్వవిద్యాలయ - సెంట్రల్ యూనీవర్సీటి తో పాటు మిగిలిన విశ్వవిద్యాలయాలలోని విద్యార్ది సంఘాల నాయకులతో చర్చించి అభ్యర్దులను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ది నాయకులైన బాల్క సుమన్ - పిడపర్తి రవిలను అభ్యర్దులుగా ప్రకటించింది. గత ఎన్నికలలో కూడా వీరిద్దరికి టిక్కెట్లు కేటాయించిది. అయితే లోక్‌ సభ సభ్యునిగా బాల్క సుమన్ ఎన్నికయ్యారు. పిడపర్తి రవి మాత్రం శాసనసభ్యునిగా ఓడిపోయారు.

గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్ది నాయకులకు టిక్కెట్లు ఇచ్చింది. అనుభవం లేని కారణంగా వారు ఓడిపోయారు. ఈసారి మాత్రం తెలంగాణ విద్యార్ది లోకంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విద్యార్ది నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా అధికార పక్షంపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ - తెలంగాణ జన సమితి భావిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ కూడా వీలున్నంత వరకు విద్యార్దులు - యువత - మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో విద్యార్ది నాయకులలో ఎవరెవరికి టిక్కెట్టు ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతున్నాట్లు సమాచారం. ఇదే అంశంపై తమతో మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం నాయకులతో కూడా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా తమకు లభించిన సీట్లలో నాలుగైదు స్ధానాలను విద్యార్ది సంఘాల నాయకులకు ఇవ్వాలనుకుంటన్నట్లు సమాచారం.