Begin typing your search above and press return to search.

అఖిలేష్ తో రాహుల్ విడాకులు

By:  Tupaki Desk   |   1 May 2017 5:56 PM IST
అఖిలేష్ తో రాహుల్ విడాకులు
X
తామిద్దరం కలిస్తే బీజేపీ - మోడీ పని అయిపోయినట్లేనని ఉత్తర్ ప్రదేశ్ ఎలక్షన్ల ముందు కలలు కన్నాయి కాంగ్రెస్ - సమాజ్ వాది పార్టీలు. కానీ... జనానికి ఆ కాంబినేషన్ ఏమాత్రం నచ్చలేదు. వారు కాదు పొమ్మన్నారు. రాహుల్ గాంధీ - అఖిలేశ్ లు భుజంభుజం కలిపి జనం మధ్యకు వెల్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ పార్టీలు ఇప్పుడు విడాకుల బాట పడుతున్నాయి. సమాజ్ వాది వైపు నుంచి ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆదివారం లక్నోలో ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మీటింగులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదితో కలిసి పోటీ చేయడం ఏమాత్రం లాభించకపోవడంతో మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ మీడియాకు చెప్పారు. యూపీ వ్యవహారాల ఇన్‌ చార్జి గులామ్‌ నబీ ఆజాద్‌ సహా కీలక నేతల సమక్షంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.

అఖిలేశ్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల.. ఆయనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా దారుణంగా నష్టపోయిందని భేటీలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. సమాజ్‌ వాదీ పార్టీతో తెగదెంపుల అనంతరం తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూచించిన ‘3కే’ ఫార్ములాకు పునరంకితం అవుతున్నట్లు యూపీ కాంగ్రెస్‌ ప్రకటించింది. కోల్పోయిన చరిష్మాను తిరిగి సాధించుకోవడం కాంగ్రెస్‌ కు తెలుసని, అతి త్వరలోనే నేలకు కొట్టిన బంతిలా దూసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌ సూచించిన ‘కార్యకర్త.. కార్యాలయం.. కార్యక్రమం..’ అనే 3కే ఫార్ములాతో కాంగ్రెస్‌ కు పునరుజ్జీవం కలుగజేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. మొన్నటి ఫెయిల్యూర్ ను అఖిలేశ్ పై నెట్టేశారు.. మరి ఈసారి కూడా ఓడిపోతే అది రాహుల్ వైఫల్యమని తేలిపోతుందని మాత్రం కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీంతో యూపీ కాంగ్రెస్ రాహుల్ ను బలిపశువును చేయడానికి రెడీ అవుతున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/