Begin typing your search above and press return to search.

మెత్తబడ్డ సచిన్ పైలట్: చిదంబరంతో మంతనాలు

By:  Tupaki Desk   |   17 July 2020 9:15 AM IST
మెత్తబడ్డ సచిన్ పైలట్: చిదంబరంతో మంతనాలు
X
రాజస్తాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్, అతని మద్దతుదారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తమకు ప్రాధాన్యం.. గౌరవం ఇవ్వడం లేదనే అసంతృప్తితో మాత్రమే తిరుగుబాటు చేసినట్లు.. పార్టీ మారే ఆలోచన మాత్రం లేదని తెలుస్తోంది. దానికి తగ్గట్టే ఆ రాష్ట్రంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సచిన్ పైలట్ మెత్తబడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన హామీ కావాలని కోరినట్లు తెలుస్తోంది.

తిరుగుబాటుపై స్పీకర్ సీపీ జోషి అనర్హత నోటీసులు ఇవ్వగా.. దానిని పైలట్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పూర్తి వివరాలతో పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే పైలట్‌ను సొంత గూటికి రావాలని కాంగ్రెస్ నేతలు పదే పదే కోరుతున్నా.. అంతగా స్పందించలేదు. ప్రియాంక గాంధీ చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. కానీ గురువారం ఆశ్చర్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంతో సచిన్ పైలట్ మాట్లాడారు. తన సమస్యల పరిష్కారంపై హై కమాండ్ స్పష్టమైన హామీ కావాలని పైలట్ కోరాడని చర్చ నడుస్తోంది. అనర్హత నోటీసులపై రాజస్తాన్‌ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత.. చిదంబరంతో పైలట్ మాట్లాడారు. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న చిదంబరంతో మాట్లాడడంతో అతడు పార్టీలో కొనసాగాలనుకుంటున్నారని భావించవచ్చు. తాను పైలట్‌తో మాట్లాడానని, హై కమాండ్ పెద్దలతో మాట్లాడాలని సూచించినట్లు ఓ జాతీయ మీడియాకు చిదంబరం తెలిపారు. అగ్ర నేతలతో సమావేశమైతే అన్నీ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని సలహా ఇచ్చినట్లు చిదంబరం వివరించారు. పైలట్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అతడికి సముచిత గౌరవం ఇస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే.. తిరిగి రావడంపై సచిన్ పైలట్ వర్గం సమాలోచనలు చేస్తోంది.

స్పీకర్ నోటీసుల తర్వాత మూడురోజుల లోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వకుంటే ఆ సభ్యుడు/సభ్యులు అనర్హతకు గురయ్యారని స్పీకర్ కార్యాలయం ప్రకటిస్తుంది. కానీ పైలట్ స్పష్టమైన సంకేతాలు ఇస్తే స్పీకర్ నిర్ణయం ఆపే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పైలట్ తిరిగి రావడం ముఖ్యమని, దాంతోపాటు రాజస్తాన్‌లో పార్టీ అధికారం కంటిన్యూ చేయడం కూడా అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

రాజస్తాన్ స్పీకర్ పైలట్ సహా 18 మందికి ఇచ్చిన నోటీసులపై శుక్రవారం మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ లోపు చర్చలు జరిగి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థనను వెనక్కి తీసుకుంటే ఏ సమస్య లేదు. లేకపోతే అనర్హత వేటు వారిపై పడే ప్రమాదం ఉంది. అనర్హత నోటీసులపై కాంగ్రెస్ తరఫున వాదిస్తోన్న అభిషేక్ సింగ్వి మాత్రం వేటు వేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారు. మరి ఏం జరగనుందో శుక్రవారం వరకు వేచిచూడాల్సిందే.