Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఏకాకి..

By:  Tupaki Desk   |   22 Sep 2019 4:29 AM GMT
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఏకాకి..
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కుటుంబంతో వెళ్లి కలిశాడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. పీసీసీ పీఠమిస్తే అధికారంలోకి తెస్తానని మాట ఇచ్చినట్టున్నాడు.. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఉబలాటపడ్డ రేవంత్ రెడ్డికి ఇప్పుడు సొంత కాంగ్రెస్ వర్గమే అసమ్మతై ఆయన ముందరి కాళ్లకు బంధం వేస్తోందట. పీసీసీ పీఠం కాదు కదా.. కనీసం ఒక సీటు విషయంలో కూడా రేవంత్ మాట తాజాగా చెల్లుబాటు కాకపోవడం కాంగ్రెస్ లో ఆధిపత్య రాజకీయాలకు అద్దం పడుతోందంటున్నారు..

తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నిలబడే అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి తనే ఒక కొత్త అభ్యర్థిని రేవంత్ ప్రకటించారు. అయితే ఉత్తమ్ ఏకపక్షంగా చర్చించకుండా ప్రకటించాడని.. ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రేవంత్ చేసిన ప్రకటన కాంగ్రెస్ లో కలకలం రేపింది.

ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆయన ఉద్దేశం తెలిసిన కాంగ్రెస్ సీనియర్లు అంతా ఏకమయ్యారు. జానారెడ్డి - కోమటిరెడ్డి - వీహెచ్ లు రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంతా ఉత్తమ్ కే సపోర్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి - శ్రీధర్ బాబు కూడా ఈ విషయంలో రేవంత్ కు సపోర్ట్ చేయకుండా ఉత్తమ్ కు అండగా నిలబడకుండా మౌనం పాటించారు.

ఉత్తమ్ కు చెక్ చెప్పాలని.. పంతం నెగ్గించుకోవాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. నాయకత్వ లోపంతో కునరిల్లుతున్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి సీఎం పీఠం లక్ష్యంగా ముందుకెళ్లాలనుకుంటున్న రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఒంటరిగా మారిపోయారు. భవిష్యత్ నేతగా వచ్చి ఇప్పుడు సీనియర్ల దెబ్బకు భవిష్యత్ లేకుండా అయిపోతున్నారు. రేవంత్ ను కాంగ్రెస్ లో వ్యూహాత్మకంగా ఏకాకిని చేసిన తీరు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.