Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ది ఏకాకి జీవితమేనా...

By:  Tupaki Desk   |   11 April 2016 11:22 AM IST
కాంగ్రెస్ ది ఏకాకి జీవితమేనా...
X
మొన్నటి ఎన్నికల్లో ఏపీలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లోనైనా ఉనికి కాపాడుకునే లక్ష్యంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. సొంతంగా సాధించలేమని డిసైడైపోయి ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. ఇటీవల కాలంలో ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు కొరుకుంటోందని అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే... ఆ పార్టీ ఆశలు తీరేలా లేవని.. ఏకాకితనం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

జగన్ - పవన్‌ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ లోకి రావాలి అని ఆ పార్టీ మాజీ ఎంపీ - సీనియర్ నేత చింతా మోహన్ చేసిన వ్యాఖ్యల మర్మమేమిటీ.. జగన్ - పవన్‌ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేంతగా ఆ పార్టీ బలంగా ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ రకమైన వ్యాఖ్యల ద్వారా ఇప్పటినుంచే ఏపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తాము పొత్తులకు సిద్దం అన్న సంకేతాలిస్తోంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే.... ఇతర పార్టీల నేతలను తన పార్టీలో చేరుకొనేంత గొప్పస్థితిలో ఏపిలో కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో తామే పొత్తుల కు సిద్దం అని చెప్పేందుకు హస్తం నేతలు సంకేతాలు పంపిస్తున్నారని ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. చింతమోహన్ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్ష మైన వైసీపీలో సైతం కొంత చర్చజరిగినట్లు సమాచారం.

టీడీపీకి వ్యతిరేకంగా ఓ ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేయాలని తాము భావిస్తున్నామని, ఇందుకోసం తమతో కలసిసొచ్చేవారిని కలుపుకొని పోతామని అని కాంగ్రెస్‌ నేతలు కొందరు చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ప్రస్తుతం అధ్వానంగా ఉంది. టీడీపీకి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేస్తున్నా... ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం రెండు పర్యాయాలు ఏపిలో పర్యటించినా కూడా పార్టీకి ఏమాత్రం మైలేజి రాలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో జతకడితే తప్పా అసెంబ్లీలో తమ పార్టీ నేతలు కాలుమోపే పరిస్థితిలేదని కొందరు నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. అయితే... ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అన్న అనుమానం కూడా కాంగ్రెస్ ను పీడిస్తోంది. ముఖ్యంగా తనను ముప్పతిప్పలు పెట్టిన కాంగ్రెస్ తో వైసీపీ జట్టు కట్టే ఛాన్సే లేదంటున్నారు. అలాగే పవన్ కూడా సిద్ధాంతాల రీత్యా, వ్యక్తిగత లక్ష్యాల రీత్యా కాంగ్రెస్ వైపు చూసే అవకాశమే లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్న పవన్ అది సొంతంగా పోటీయా లేదా ఇతరులతో కలిశా అన్నది వెల్లడించలేదు. అయినప్పటికీ ఆయన కలిస్తే ఎప్పటిలా టీడీపీ - బీజేపీతో తప్ప కాంగ్రెస్ తోకలిసే అవకాశాలు లేవు. పవన్ టిడిపి సర్కార్‌ పై కొంత అసహనంతో వ్యాఖ్యలు చేసినా కేంద్రంలోని బిజెపిపై మాత్రం మాట మాత్రమైనా విమర్శలు చేయడంలేదు. దీంతో పవన్ కళ్యాణ్ సమీప భవిష్యత్తులో బిజెపివైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను ఆయన దగ్గరయ్యే అవకాశాలు నామమాత్రంగా లేవని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోరాటం చేయాల్సి ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.