Begin typing your search above and press return to search.

పార్టీని బతకనివ్వరా?

By:  Tupaki Desk   |   27 Jun 2015 10:28 AM IST
పార్టీని బతకనివ్వరా?
X
సీతకష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్న సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభేధించినా...తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీని రెండుగా విడగొట్టారు అనే

ప్రగాడ విశ్వాసంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు. మరోవైపు ప్రత్యేక హోదా, ఆర్థికలోటు తదితర విభజనాంతర కష్టాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణం అనే రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉంది. అయితే కాంగ్రెస్ పెద్దలు సైతం తమకు కుంపట్లు పెడుతున్నారని ఏపీ హస్తం నేతలు వాపోతున్నారు.

ఏపీ విభజన చట్టం సెక్షన్‌ 10 ప్రకారం దాదాపు 110 సంస్థలు ఏపీ, తెలంగాణకు చెందుతాయి. అయితే అవి ఉన్న భూభాగం, వాటికి సమకూరిన నిధులు, ఇతరత్రా అంశాల కారణంగా రెండు తెలుగు రాష్ర్టాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్నింటి విషయంలో కోర్టు గుమ్మం ఎక్కడం...రాష్ర్ట హైకోర్టులో న్యాయం జరగకపోతే.... సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. కొద్దికాలం క్రితం ఏపీ ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా మండలికి సంబంధించి ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసింది. దీనిపై ఏపీ సర్కారు హైకోర్టు ఆశ్రయించగా తీర్పు ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా ఏపీ వర్సెస్ టీ సర్కారు అనే పరిస్థితి క్రియేట్ అయింది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్ సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. ఆపార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీకి కూడా సమర్థుడైన న్యాయవాదిగా పేరుంది. ఈ ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాంకేతిక విద్యా మండలి తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ పరిణామం ఏపీ కాంగ్రెస్‌ నేతలకు మింగుడు పడటం లేదు. ఏపీలోని మొత్తం 13 జిల్లాల నుంచి ఒక్క ఎంపీ లేదా ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఇప్పటికే తాము నామ్ కే వాస్తీగా మారిపోయామంటే...ఈ కొత్త టెన్షన్ ఏంటంటూ వారు వాపోతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలపై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. కేరళలోని ఉమెన్ చాంధీ నేతృత్వంలోగల ప్రభుత్వం లాటరీలు, మద్యనిషేధాన్ని విధించింది. అయితే దీనిపై సాధారణంగానే కేసులు నమోదయ్యాయి. అయితే న్యాయవాదులు అయిన కాంగ్రెస్‌ నేతలు ఎవరూ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదించకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తెలంగాణ సర్కారు నిర్ణయాల వల్ల నష్టపోయేది ఏపీ ప్రజలే. అయితే కాంగ్రెస్ నేతలుగా ఉన్న న్యాయవాదులు ఏపీకి వ్యతిరేకంగా వాదిస్తే నష్టపోయేది ఏపీ ప్రజలే కాదు...ఏపీ కాంగ్రెస్‌ కూడా అని భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ....' కేరళ కాంగ్రెస్ నేతల వలే అధిష్ఠానంపై ఒత్తిడి తేవడంలో మీరు ఎందుకు విఫలమయ్యారు?'అంటూ ప్రత్యర్థి పార్టీలు నిలదీస్తాయని, అపుడు తాము సమాధానం చెప్పలేమని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.