Begin typing your search above and press return to search.

అయ్యో.. అలాంటి పార్టీకి చివరికి ఇలాంటి దుర్గతా?

By:  Tupaki Desk   |   1 Jan 2023 12:26 PM IST
అయ్యో.. అలాంటి పార్టీకి చివరికి ఇలాంటి దుర్గతా?
X
2004 నుంచి 2014 వరకు వరుసగా కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో అధికారం చలాయించిన పార్టీ తర్వాత ఒక్క సీటు కూడా లేకుండా మట్టికొట్టుకుపోతుంది అంటే ఎవరైనా నమ్ముతారా? అది అసలు కలలోనైనా సాధ్యమవుతుందా? అంటే అదే జరిగింది.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను ఎప్పుడైతే కాంగ్రెస్‌ రెండుగా విభజించిందో ఇక అంతే ఆ పార్టీకి ఏపీలో నూకలు చెల్లిపోయాయి. వరుసగా రెండు పర్యాయాలు అధికారం అనుభవించిన ఆ పార్టీ.. ఆ తర్వాత వరుసగా పరాజయం పాలైంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోనంత స్థాయికి పడిపోయింది. రాష్ట్ర విభజన వద్దని చెప్పినా పెడచెవిన పెట్టడంతో ఆ పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు ఏపీలో ఆ పార్టీలో వృద్ధతరం నేతలు మాత్రమే మిగిలారు. కేంద్రంలో అధికారంలో లేకపోవడం.. కేవలం దేశంలో మూడు రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, హిమాచలప్రదేశ్‌ ల్లో మాత్రమే అధికారంలో ఉండటంతో ఆ పార్టీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాలయాల అద్దెలు, వాటి నిర్వహణను కూడా భరించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉందని టాక్‌ నడుస్తోంది. ఇందుకు నిదర్శనం... ఆస్తి పన్ను చెల్లించనందుకు విశాఖ నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు తాళం వేశారు. సుమారు 37 ఏళ్ల నుంచి ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని, రూ.24 లక్షల మేర బకాయి ఉన్నట్టు ఆ పార్టీ నాయకులకు అధికారులు సమాచారం అందించారు.

మరోవైపు తమ పార్టీ కార్యాలయానికి తాళం వేయడంపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాల్సిందిగా మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణను కలిసి విన్నవించామని ఈలోగా అధికారులు తాళాలు వేయడమేమిటని నగర పార్టీ అధ్యక్షుడు గోవింద్‌ అన్నారు.

విశాఖపట్నం కాంగ్రెస్‌ అంటే ద్రోణంరాజు సత్యనారాయణ, టి.సుబ్బరామిరెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, గుడివాడ గుర్నాథరావు వంటి నేతలు గుర్తొచ్చేవారు. అలాంటిది రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలక నేతలంతా టీడీపీ, వైసీపీ, తదితర పార్టీల్లో చేరిపోయారు. దీంతో పార్టీ కార్యాలయాల నిర్వహణ కూడా కష్టమైంది.

విశాఖ సిటీ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గతంలో నాయకులతో కళకళలాడుతూ ఉండేది. మహామహులు ఆ సమావేశాల్లో కనిపించేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఓ వైభోగంగా ఉండేదని అంటున్నారు. అలాంటి పార్టీకి ప్రస్తుతం ఇలాంటి దుర్గతి పట్టడం విచారకరమేనంటున్నారు.

పీసీసీ కొత్త ప్రెసిడెంట్‌ గా ఇటీవల నియమితుడైన గిడుగు రుద్రరాజు ఇటీవల అదే ఆఫీసులో సమావేశం కూడా నిర్వహించారు. బకాయిల విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారని చెబుతున్నారు. అయితే ఆయన సైతం పట్టించుకోలేదంటున్నారు. దీంతో బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఆ కార్యాలయానికి తాళం వేశారు.