Begin typing your search above and press return to search.

గాంధీలు తప్పుకుంటే బెటర్... ?

By:  Tupaki Desk   |   17 March 2022 5:12 PM IST
గాంధీలు తప్పుకుంటే బెటర్... ?
X
గాంధీలు అంటే కాంగ్రెస్ లో ఎంతో గౌరవం. వారి మాట అక్కడ శిలాశాసనం. గాంధీ అన్న పేరు ఉంటే చాలు కాంగ్రెస్ అధ్యక్ష పీఠం వారికే రిజర్వ్ అవుతుంది. ఇక ప్రధానమంత్రి పదవి కూడా వారు తీసుకోకపోతేనే ఇతరుల చేతులలోకి వచ్చేది. మొత్తానికి చూస్తే గత ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని గాంధీలే ముందుండి నడిపిస్తున్నారు.

అయితే నాయకత్వ సంక్షోభం ఎపుడూ కాంగ్రెస్ లో ఈ స్థాయిలో ఎదురుకాలేదు. ఇందిరాగాంధీ టైమ్ లో సీనియర్లు ఆమెను సవాల్ చేసినా తన సమర్ధతతో ఆమె నెట్టుకువచ్చారు. వారినే పక్కనపెట్టి ఇందిరా కాంగ్రెస్ అని పార్టీని చీల్చి ఏర్పాటు చేశారు. అలా ఈ రోజు వరకూ కూడా ఆ పార్టీయే దేశంలో ఉంది.

ఇందిర తరువాత అందుకువస్తాడనుకున్న సంజయ్ గాంధీ ఒక ప్రమాదంలో చనిపోవడంతో కాంగ్రెస్ కి నాడే ఇబ్బంది ఎదురైంది. రాజకీయాల మీద ఆసక్తి లేని రాజీవ్ గాంధీని తెచ్చి పెట్టినా ఆయన తల్లి ఇందిర అంతలా అటు పార్టీని కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ ప్రభావితం చేయలేకపోయారు.

ఇక ఆనాడే కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయని చెప్పాలి. తరువాత రోజులలో కాంగ్రెస్ లో సీనియర్ నేతలు అంతా కలసి విశ్వనాధ్ సింగ్ ప్రతాప్ నాయకత్వాన బయటకు వచ్చేశారు. అలా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ని 1989లో రెండవ మారు ఓడించారు. నాటి నుంచి మెల్లగా బలహీనపడుతొ వస్తున్న కాంగ్రెస్ 1991లో రాజీవ్ హత్య తరువాత ఇంకా ఇబ్బందులను చూసింది. పీవీ నరసింహారావు లాంటి వారు ప్రధానిగా ప్రభుత్వాన్ని నడిపినా పార్టీ మాత్రం ఒడుదుడుకులను ఎదుర్కొంటూనే ఉంది.

1998లో సోనియా గాంధీ సారధ్యం వహించాక కొంత కుదుట పడింది అనుకున్నా అధికార కేంద్రం చుట్టూ భజన బృందాలు చేరడం, పని చేయని వారికి పదవులు, పార్టీ కోసం కష్టపడిన వారికి అవమానాలు సామాన్యం అయ్యాయి. అయినా సరే యూపీఏ పేరిట కాంగ్రెస్ చేసిన ప్రయోగం 2004లో ఫలించింది, దాంతో ఇతర పార్టీల మద్దతుతో కాంగ్రెస్ నాడు గెలిచింది. 2009 నాటికి కూడా బీజేపీ నుంచి సరైన ప్రతిఘటన లేకపోవడంతో కాంగ్రెస్ విజయం సునాయాసం అయింది.

కానీ 2014 తరువాత మాత్రం కాంగ్రెస్ ఉనికి పోరాటమే చేస్తోంది. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో దేశంలో యాభై దాకా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది కేవలం అయిదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. లేటెస్ట్ గా జరిగిన ఉత్తరాది ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తింది. ఆరున్నర శాతం 2017 నాటికి ఉన్న ఓటు బ్యాంక్ కాస్తా రెండున్నర శాతానికి తగ్గడం అంటే కాంగ్రెస్ చిరునామా ఎక్కడ అని వెతకాల్సిందే.

ఇక ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తారస్థాయిలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ లో పార్టీ హామీ మేరకు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత, రాష్ట్రాన్ని పాలించడం తన వంతు అని భావించే టీఎస్ సింగ్ డియోతో రెడీగా ఉన్నారు. రాజస్థాన్‌లో కూడా అదే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య పోరు అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కి మరో అగ్ని పరీక్ష ఈ ఏడాది చివరలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లలో ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు ఆశలు అయితే ఎవరికీలేవు. ఒక వైపు ఆప్ లాంటి పార్టీలు ముందుకు దూసుకువస్తున్నాయి. ఇంకో వైపు మోదీ ఇమేజ్ తో పాటు బీజేపీ పటిష్టంగా ఉంది.

ఈ నేపధ్యంలో జీ 23 పేరిట అసమ్మతి నేతలు తాజాగా గులాం నబీ అజాద్ ఇంట్లో సమావేశమై రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేశారు. మరి సోనియా గాంధీ తరువాత ఎవరు అంటే గాంధీయేతరులకే అవకాశం ఇవ్వాల‌ని అంటున్నారు. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ పేరును ప్రతిపాదిస్తున్నారు.

ఈ స్థితిలో కూడా గాంధీల చుట్టూ ఉండే కోటరీ మాత్రం వారే ప్రెసిడెంట్లుగా ఉండాలని కోరుతోంది. ఒక వేళ గతంలో మాదిరిగా గాంధీలు విజయాలను తెచ్చిపెట్టే స్థితిలో లేరు అన్నదే చర్చగా ఉంది. అసమ్మతికి కాంగ్రెస్ పెట్టింది పేరు. పంజాబ్ లాంటి చోట కెప్టెన్ అమరీందర్ సింగ్ ని బయటకు పంపి సరైన వ్యూహాన్ని రూపొందించలేని జూనియర్ గాంధీలు రేపటి రోజున వచ్చే ఏ కొత్త తలనొప్పులు తట్టుకోలేరు అనే అంటున్నారు

మొత్తానికి చూస్తే సీడబ్ల్యూసీ మీటింగులో సోనియా గాంధీ తమను తప్పుకోమంటే తప్పుకుంటామని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అది ఎత్తుగడగా కాకుండా నిజంగా ఆ పని చేస్తేనే గాంధీలకు గౌరవం దక్కుతుంది అంటున్నారు. కాంగ్రెస్ నుంచి గాంధీలు తప్పుకుంటే ఆ పార్టీ ఏమిపోతుందో అని వగచే వారు గాంధీల పరువు పోతోంది అని ఆలోచించడంలేదు అంటున్నారు. మొత్తానికి ఘన‌మైన గాంధీ వంశీకులు ఈ కీలక సమయాన సరైన ఆలోచన చేయడమే బెటర్ అన్న సూచనలు ఉన్నాయి.