Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు ఆశాకిర‌ణం ఆయనేనా?

By:  Tupaki Desk   |   12 Nov 2016 11:58 AM IST
కాంగ్రెస్‌ కు ఆశాకిర‌ణం ఆయనేనా?
X
ఏపీలో వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజికి వెళ్లిపోతోంది. నేతలంతా కాడి పక్కనపడేసినా ఇంతకాలం ఒంటరి పోరాటం చేసిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఇప్పుడు ఓపిక - సత్తువ సన్నగిల్లి బేల చూపులు చూస్తున్నారు. రెండున్నరేళ్లుగా ఒక్కరే అన్నీ తానై పార్టీ పేరు కనీసం మీడియాలో వినిపించేలా ఏదో ఒక ప్రయత్నం చేశారాయన. అయినా విభజన పాపం ఊరికే పోక.. పార్టీ నేతలు ఎవరూ కలిసిరాక ఆయన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. నేతలంతా ఖాళీ అవుతుండడమే తప్ప ఎవరూ పార్టీలోకి వచ్చే పరిస్థితి లేక.. ఉన్నవారూ కార్యక్రమాలకు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీకి దూరంగా ఉన్న మాజీలను మళ్లీ తేవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కన్నేసినట్లు చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనే విషయమై ఊహా గానాలు వెలువడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై దృష్టి సారించినట్లు సమాచారం. జనసేన పార్టీతోపాటు వైఎస్సార్‌ సిీపీ - బీజేపీ లు ఆయన్ను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నాయి. అయినప్పటికీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన మనసులోని మాటను మాత్రం బయటకు చెప్పకుండా గుంభనంగా ఉండిపోయారు. ఆ మూడు పార్టీలు కూడా కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోసం స్వయంగా రంగంలోకి దిగింది.

రాష్ట్ర విభజన విషయంలో తప్పితే కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గంతో కిరణ్‌ కు ఎలాంటి పేచీ లేదు. రాజకీయ కుటుంబానికి చెందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డికి హేమాహేమీలను కాదని ముఖ్యమంత్రి పదవిని ఇచ్చామనే అభిప్రాయం కాంగ్రెస్‌ పార్టీలో ఉంది. పైగా ఆయన తండ్రి అమర్‌ నాథరెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా - మంత్రిగా పనిచేసిన వారేనని దీంతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో సముచితంగానే ఉంటుందని హైకమాండ్‌ అభిప్రాయపడ్డా - పరిస్థితుల్లో ఇప్పటికే మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ నేత ఒకరు ఇప్పటికే కిరణ్‌ కుమార్‌ రెడ్డితో టచ్‌ లో ఉన్నారు. కేవలం తాను చెప్తే వినకుండా రాష్ట్రాన్ని విభజించారనే ఏకైక కారణంతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయింది కూడా. అయితే పార్టీ నుంచి ఎంతో గౌరవం పొందినందువలన ప్రస్తుతం కష్టాల్లో ఉండడంతో పార్టీలో చేరి రుణం తీర్చుకోవాలనే డిమాండ్‌ కూడా వినవస్తోంది. త్వరలోనే తన రాజకీయ భవితవ్యంపై ఒక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించారు.

మరోవైపు ఆయన తనకు అత్యంత సన్నిహితులైన వారితో మంతనాలు ప్రారంభించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా ప్రభుత్వంలో చేరుతారని వెల్లువెత్తిన ఊహాగానాలకు ఆయన తెరదించలేదు. రాజకీయ భవితవ్యంపై ఆచితూచి అడుగులు వేస్తున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి తనకు స్వేచ్ఛనిచ్చే పార్టీలో ఉంటానని చెబుతున్నారు. దీంతో ఆయన రూటు మళ్లీ కాంగ్రెస్ వైపేనని అర్థమవుతోంది..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/