Begin typing your search above and press return to search.

చిత్తుచిత్తుగా ఓడినా..వాళ్ల‌లో మార్పు రాదా?

By:  Tupaki Desk   |   10 Jan 2019 4:59 AM GMT
చిత్తుచిత్తుగా ఓడినా..వాళ్ల‌లో మార్పు రాదా?
X
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు అనుస‌రిస్తున్న వైనంపై కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఎలా ఉంది? ఈ మ‌ధ్య‌న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశాల్ని కాల‌ద‌న్నిందెవ‌రు? గెలుపును కాస్తా ఓట‌మిగా మార్చిన ఫ్యాక్ట‌ర్స్ ఏమిటి? కేసీఆర్ చేతిలో పొట్టు పొట్టుగా ఓడిన దాన్లో బాధ్య‌త ఎవ‌రిది? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల్ని విశ్లేషించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లంతా ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు పీక‌ల్లోతు కోపం పెట్టుకొని.. మాట‌ల దాడి చేసుకుంటున్న ప‌రిస్థితి. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి కేసీఆర్‌పై మూకుమ్మ‌డిగా విరుచుకుప‌డాల్సిన నేత‌లంతా.. చెట్టుకు ఒక‌రు పుట్ట‌కు ఒక‌ర‌న్న‌ట్లుగా ఉన్న ప‌రిస్థితి.

రానున్న ఐదేళ్లు ఎలా బండి లాగాల‌న్న దానిపై కిందా మీదా ప‌డుతూ.. త‌మ‌కీ దుస్థితికి కార‌ణ‌మైన నేత‌ల్ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో.. ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఓట‌మి పాఠాలు నేర్పుతుంద‌న్న దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఓట‌మిని క‌సిగా తీసుకొని.. ఎక్క‌డ త‌ప్పు దొర్లింద‌న్న ఆత్మ‌శోధ‌న మాని.. అందుకు భిన్నంగా సొంత పార్టీ నేత‌ల మీద చేస్తున్న విమ‌ర్శ‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ అధికార‌ప‌క్షం టీఆర్ ఎస్ కు ఈ వ్య‌వ‌హారం పండ‌గ‌గా మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఢిల్లీ అధినాయ‌క‌త్వం చేసిన త‌ప్పులు కొన్ని అయితే.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రికి వారుగా చేసిన త‌ప్పుల‌తో క‌లిసి.. మొత్తంగా ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మిని మూట‌క‌ట్టుకుంది. ఇలాంటివేళ‌.. ఓట‌మి నుంచి కొత్త పాఠాలు నేర్చి మ‌రింతగా దూకుడుగా దూసుకెళ్లాల్సిన దానికి భిన్నంగా అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల్లో బిజీబిజీగా మారిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరుపై కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం కోపంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

చిత్తు చిత్తుగా ఓడినా వీరిలో మార్పు రాదా? వీరంతా క‌లిసి పార్టీని ఏం చేద్దామ‌నుకుంటున్నారు? ఇలానే సాగితే తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మార‌టం ఖాయ‌మ‌న్న భావ‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో మోడీ విసురుతున్న స‌వాళ్ల‌కు.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చూపిస్తున్న చుక్క‌ల‌తో ఇప్ప‌టికే కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇలాంటివేళ‌.. ఐక‌మ‌త్యంతో క‌లిసిక‌ట్లుగా క‌ష్ట‌ప‌డితే త‌ప్పించి సానుకూల ఫ‌లితాలు రాని దుస్థితి. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై గుర్రుగా ఉన్న ఒక సీనియ‌ర్ నేత త‌న అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో.. పార్టీకి పోయే కాలం వ‌చ్చింద‌న్న తీవ్ర వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి య‌మా అర్జెంట్ గా బైపాస్ స‌ర్జ‌రీ చేయాల్సిన టైం వ‌చ్చింద‌ని.. ఆ విష‌యంలో ఏ మాత్రం ఆల‌స్యం చేసినా పార్టీ దారుణ ప‌రిస్థితి ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు.