Begin typing your search above and press return to search.

కెలికి తిట్టించుకోవ‌టంలో కాంగ్రెసోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా?

By:  Tupaki Desk   |   1 Jun 2019 5:11 PM IST
కెలికి తిట్టించుకోవ‌టంలో కాంగ్రెసోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా?
X
కాంగ్రెస్ నేత‌ల తీరు భ‌లే సిత్రంగా ఉంటుంది. ఇవాల్టి రోజున మీడియా.. సోష‌ల్ మీడియా ఎంత పాస్ట్ గా ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇలాంటివేళ‌.. చేసే వ్యాఖ్య‌లు ఆచితూచి అన్న‌ట్లు ఉండాలి. ఏ మాత్రం శ్రుతి మించినా తోక క‌త్తిరించ‌టానికి కోట్లాది మంది సోష‌ల్ మీడియాలో సిద్ధంగా ఉన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంటివేళ‌.. అవ‌గాహ‌నారాహిత్యంతో కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు చేసే వ్యాఖ్య‌లు కెలికేలా ఉండ‌ట‌మే కాదు.. క‌డుపు నిండి తిట్లు తినేలా చేస్తున్నాయ‌ని చెప్పాలి.

ప్ర‌త్య‌ర్థి సాధించిన విజ‌యాన్ని ఒప్పుకోవాలంటే పెద్ద మ‌న‌సు ఉండాలి. అలాంటి వాటిని ఈ త‌రం కోరుకుంటుంది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు గుర్తించాలి. ఆ విష‌యంలో జ‌రిగే త‌ప్పులు ఆ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయ‌ని చెప్పాలి. అందుకు నిద‌ర్శ‌నంగా తాజా ఉదంతం చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి. మోడీ మంత్రివ‌ర్గంలో కీల‌క‌మైన ఆర్థికశాఖ‌ను చేప‌ట్టిన నిర్మ‌లా సీతారామ‌న్ కు అన్ని వ‌ర్గాల నుంచి అభినంద‌న‌లు అందుతున్నాయి. దేశ తొలి మ‌హిళా ఆర్థిక‌మంత్రిగా ఆమె చ‌రిత్ర సృష్టించ‌ట‌మే కాదు.. తొలిసారి మాల‌క్ష్మిదేవే దేశ ఆర్థిక మంత్రి (మ‌హిళ‌ను ల‌క్ష్మీదేవిగా కొలిచే న‌మ్మ‌కంతో)గా అయ్యార‌న్న వ్యాఖ్య‌లు వినిపించాయి. ఆమెకు పెద్ద ఎత్తు అభినంద‌న‌లు అందుతున్నాయి.

ఇలాంటివేళ‌.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ.. సోష‌ల్ మీడియా వింగ్ నేత ర‌మ్య కూడా అభినంద‌న‌లు తెలిపారు. బుద్దిగా నాలుగు మాట‌లు పొగిడేసి.. అక్క‌డితో ఆపితే స‌రిపోయేది. కానీ.. కెలికే అల‌వాటున్న కాంగ్రెస్ నేత‌లు త‌మ ల‌క్ష్మ‌ణాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా ఉండ‌రు క‌దా? అందుకు త‌గ్గ‌ట్లే ఆమె ఒక ట్వీట్ చేశారు. అందులో.. 1970లో ఇందిరాగాంధీ జీ ఆర్థిక‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి మ‌హిళ‌ల‌ను గ‌ర్వ‌ప‌డేలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆ శాఖ‌ను చేప‌ట్టినందుకు అభినంద‌న‌లు.. జీడీపీ అంత గొప్ప‌గా లేదు.. అయినా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా కృషి చేస్తార‌ని తెలుసు.. మీకు ఎల్ల‌ప్పుడూ మా స‌హ‌కారం ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌ధాని హోదాలో ఉన్న ఇందిర అప్ప‌ట్లో ఆర్థిక‌శాఖ‌ను కూడా త‌న ద‌గ్గ‌ర ఉంచుకున్నారు. అంతేకానీ.. ఆమేమీ ఆర్థిక‌శాఖ మంత్రిగా నేరుగా వ్య‌వ‌హ‌రించింది లేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ప‌లువురు నెటిజ‌న్లు ర‌మ్య మీద విమ‌ర్శ‌ల పంచ్ లు విసిరారు. దేశ తొలి ఆర్థిక‌మంత్రి అని నిర్మ‌లా సీతారామ‌న్ ను పిల‌వ‌టం కాంగ్రెస్ వాళ్ల‌కు ఇష్టం ఉండ‌దేమో? మేడ‌మ్‌.. ప్ర‌ధానిగా ఉండి ఆర్థిక శాఖ‌ను త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నా. కానీ.. నిర్మ‌లాజీపై న‌మ్మ‌కంతో ప్ర‌ధాని ఆమెకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కాబ‌ట్టి తొలి దేశ ఆర్థిక‌మంత్రిగా ఆమెను ప‌రిగ‌ణించాలి.. ఇక మీ దృష్టిలో జీడీపీ అంటే.. గాంధీ డైన‌స్టీ పాలిటిక్స్ అనుకుంటా.. అభినందించే క్ర‌మంలో ఇలా రాజ‌కీయాలు చేయ‌టం.. ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌టం స‌రైనది కాదంటూ ముఖం ప‌గిలేలా ట్వీట్ పంచ్ విసిరారు. అందుకే అనేది.. మీడియాతో పెట్టుకున్నా ఫ‌ర్లేదు కానీ సోష‌ల్ మీడియాతో పెట్టుకోకూడ‌ద‌నేది. ఈ విష‌యంలో కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వింగ్ చూసే ర‌మ్య‌కు చెప్పాల్సి రావ‌టం ఏమిటి ఖ‌ర్మ‌..?