Begin typing your search above and press return to search.

బాబు తీరుపై కాంగ్రెస్ నేత‌ల్లో క‌ల‌వ‌రం!

By:  Tupaki Desk   |   28 Oct 2018 10:22 PM IST
బాబు తీరుపై కాంగ్రెస్ నేత‌ల్లో క‌ల‌వ‌రం!
X
అదేంటి...ఇటీవ‌ల అంశం ఏదైనా...కాంగ్రెస్ పేరు ఎత్త‌కుండా ముగించని ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్‌ లో ఎలా గుబులు రేపుతారు? పైగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని మరీ ఎన్నిక‌ల బ‌రిలోకి దూకాల‌ని సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో...బాబు స్కెచ్ ఆ పార్టీ నేత‌ల‌ను ఎలా క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంది అంటారా?బాబు చూపిస్తున్న‌పొత్తు ఆస‌క్తే కాంగ్రెస్ నేత‌ల ఆందోళ‌న‌కు కార‌ణం అవుతోంది. ``మ‌న‌కు పొత్తు ముఖ్యం...సీట్లు కాదు..అవ‌స‌ర‌మైతే మీరు సీట్లు వ‌దులుకోండి`` అంటూ గ‌త సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌కు ఆర్డ‌ర్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ పొత్తుపై కాంగ్రెస్‌ లోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం తెలంగాణ వరకు విశ్లేషిస్తే టీఆర్‌ ఎస్ తర్వాత కాంగ్రెస్ - ఎంఐఎం కాకుండా మరే పార్టీ కూడా అధికార పీఠాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేదు. ఈ పరిస్థితిలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు జరిగే లాభం ఏమిటని తెలంగాణ కాంగ్రెస్‌ లో అంతర్మథనం మొదలైంది. ఒంటరిపోరు చేయలేని టీడీపీ.. పొత్తు పేరుతో ఆడుతున్న నాటకంలో కాంగ్రెస్ భవితవ్యం ఏమవుతుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చే సీట్లన్నీ టీఆర్‌ ఎస్‌ కు అప్పగించినట్టేనని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఎలాంటి ఓటు బ్యాంకు లేని టీడీపీ - సీపీఐ - టీజేఎస్‌ తో పొత్తు తమకు ఏ మాత్రం కలిసివస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్‌ లో మొదలైంది. అందుకే సీట్ల పంపిణీ విషయంలో తాత్సారం జరుగుతున్నదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్ నేతల్లోనూ తెలంగాణలో టీడీపీతో పొత్తు ఏపీలో జరిగే ఎన్నికలపై ఏ విధంగా ప్రభావితం చూపుతుందోనన్న భయం మొదలైంది.

వీట‌న్నింటికీ తోడుగా బాబు ఇంత ఓపెన్ ఆఫ‌ర్‌ తో తెలంగాణ‌లో కాంగ్రెస్‌ తో దోస్తీకి త‌హ‌త‌హ‌లాడ‌టం వెనుక ఆయ‌న‌కు సంబంధించిన రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధానంగా ఉండి ఉంటాయి త‌ప్పించి కాంగ్రెస్‌ కు మేలు చేసే అంశాలు త‌క్కువ‌ని ఇంకొంద‌రు పేర్కొంటున్నారు. ఓవైపు రాజ‌కీయ సిద్ధాంతాన్ని తుంగ‌లో తొక్కి పొత్తు పెట్టుకోవ‌డం మ‌రోవైపు త‌మ‌కు బ‌లం ఉన్న‌చోట సీట్లు కోల్పోవ‌డం...అదే స‌మ‌యంలో బాబు అవకాశ‌వాద రాజ‌కీయాల‌కు అండ‌గా ఉండ‌టం త‌మ‌కు ఎలా మేలుచేస్తుంద‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ్యాఖ్యానిస్తున్న‌ట్లు స‌మాచారం.