Begin typing your search above and press return to search.

లోక్ సభలో ఏం జరిగింది? కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఎంపీ దాడి చేయబోయారా?

By:  Tupaki Desk   |   7 Feb 2020 8:00 PM IST
లోక్ సభలో ఏం జరిగింది? కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఎంపీ దాడి చేయబోయారా?
X
శుక్రవారం లోక్ సభలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ మీద ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో అధికార.. ప్రతిపక్ష నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం చేసిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రస్తావించిన రాహుల్.. దేశ యువకులు ప్రధాని వీపుపై కర్రలతో కొడతారన్నారు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ.. తనపై రాహుల్ చేసిన దురుసు వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. రోజు చేసే సూర్య నమస్కారాల సంఖ్య పెంచటం ద్వారా వీపును మరింత బలంగా చేసుకునే ప్రయత్నం చేయటం ద్వారా.. దెబ్బలకు తట్టుకోగలన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు లోక్ సభలో ప్రధాని మోడీపై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి హర్షవర్దన్ తీవ్రంగా ఖండించారు. ప్రధానిపై తీవ్ర పదజాలం వాడారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే స్పీకర్ కలుగ జేసుకొని కేంద్రమంత్రి ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. ఈ క్రమం లో ఆయన బదులిచ్చే సమయం లో కాంగ్రెస్ ఎంపీ మణికా ఠాగూర్ కేంద్రమంత్రి వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

దీంతో..ఆయన్ను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ అడ్డుకున్నారు. దీంతో అధికార.. విపక్షాల మధ్య రగత మరింత పెరిగింది. సభను అదుపులో ఉంచేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో వరుసగా రెండుసార్లు వాయిదా వేశారు. కేంద్రమంత్రి పై తమ పార్టీ ఎంపీ దాడి చేసేందుకు యత్నించ లేదని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోడీని కాపాడేందుకే బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. అందుకు తగ్గట్లు రగడకు ప్రయత్నించారన్నారు. లోక్ సభ లో తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని. . ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఎవరి మీదా దాడికి యత్నించలేదన్న రాహుల్.. తమ ఎంపీ మీదనే దాడి జరిగిందని ఆరోపించారు. తాజా పరిణామాలతో లోక్ సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.