Begin typing your search above and press return to search.

పాలు.. కూరగాయలు మోసేటోళ్లకే పదవులా?

By:  Tupaki Desk   |   25 April 2016 10:57 AM GMT
పాలు.. కూరగాయలు మోసేటోళ్లకే పదవులా?
X
రెండు తెలుగురాష్ట్రాల్లోని అధికారపక్షాలు ఆపరేషన్ ఆకర్ష్ ను మా జోరుగా చేపట్టాయి. వాటి దెబ్బకు విపక్ష నేతలు పలువురు అధికారపార్టీ తీర్థం పుచ్చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఖమ్మం ఎమ్మెల్యే .. కాంగ్రెస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సిద్ధిపేట కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫారుఖ్ హుస్సేన్ సైతం కారు ఎక్కేందుకు మోజు ప్రదర్శించటం ఒక ఎత్తు అయితే.. పార్టీ మారే క్రమంలో కాంగ్రెస్ మీద సదరు ఎమ్మెల్సీ చేసిన విమర్శలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ పార్టీ కారణంగా పదవి వచ్చిందో ఆ పార్టీ మీదనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పాలు.. కూరగాయలు మోసేటోళ్లకే కాంగ్రెస్ పార్టీలో పదవులన్న ఫారుఖ్.. పార్టీలో డబ్బులన్న వారికే ప్రాధాన్యత లభిస్తోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ టిక్కెట్లను పార్టీ నేతలు అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదు చేసినా పార్టీ పట్టించుకోలేదన్న ఆయన.. పెద్ద నాయకులంతా ప్రభుత్వంతో సర్దుబాట్లు చేసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేయటం కలకలంగా మారింది. ఎంత కారు ఎక్కితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద అన్నేసి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పారుఖ్ చేసిన విమర్శలు నిజమే అనుకుంటే.. పారుఖ్ పదవి మాటేమిటి..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారెవరు?