Begin typing your search above and press return to search.

గులాబీ.. కాషాయం మధ్య సీరియస్ వార్.. ఆటలో అరటిపండులా జగ్గారెడ్డి ఎపిసోడ్

By:  Tupaki Desk   |   3 July 2022 4:05 PM IST
గులాబీ.. కాషాయం మధ్య సీరియస్ వార్.. ఆటలో అరటిపండులా జగ్గారెడ్డి ఎపిసోడ్
X
లక్ష్యం లేని నడక.. గమ్యం లేని ప్రయాణం ఎలా ఉంటుందో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వీహెచ్.. జగ్గారెడ్డిల తీరు ఉందన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలు.. బీజేపీ వ్యతిరేక పక్షాలు బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన.. తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా.. యశ్వంత్ సిన్హాను కలిసే విషయంలో టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కలిసే నేత ఎవరైనా.. ఏ స్థాయి అయినా సరే తాము కలిసే ప్రసక్తే లేదని రేవంత్ తేల్చేశారు.

ఆ ఇంటి మీద వాలిన కాకి.. ఈ ఇంటి మీద వాలే అవకాశం ఇవ్వమని.. ఈ విషయంలో మరో మాటకు తావు లేదంటూ విస్పష్ట ప్రకటన చేశారు. ఇందుకు తగ్గట్లే.. యశ్వంత్ కు స్వాగతం పలికేందుకు రేవంత్ అండ్ కో వెళ్లలేదు. కానీ.. తగదునమ్మా అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు వెళ్లటంతో కొత్త రచ్చ మొదలైంది. తెలంగాణ పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్న రేవంత్ మాటలకు భిన్నంగా వీహెచ్ వెళ్లటం.. ఆయనకు స్వాగతం పలకటం.. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి నడవటం లాంటి వాటిపై రేవంత్ సీరియస్ అయ్యారు.

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదని.. గోడకేసి కొడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీహెచ్ పై చేసిన వ్యాఖ్యలపై ఒక్కసారిగా చెలరేగిపోయారు జగ్గారెడ్డి. వీహెచ్ చేసిన తప్పేంటి? ఎయిర్ పోర్టుకు వెళ్లటంలో ఏ మాత్రం తప్పు లేదన్న సర్టిఫికేట్ ఇచ్చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో యశ్వంత్ సిన్హా పక్కనే రాహుల్ గాంధీ ఉన్నారని.. పార్టీ అగ్రనేతకు లేని అభ్యంతరం రేవంత్ కు ఎందుకు? అన్నది జగ్గారెడ్డి ప్రశ్న.

దీనిపై రేవంత్ వర్గీయుల వాదనలు మరోలా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్.. టీఆర్ఎస్ ల మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందంటూ బీజేపీ వ్యాఖ్యలు చేయటం.. ఇలాంటి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ లబ్థి పొందాలని చూస్తున్న వేళ.. వీహెచ్ లాంటి సీనియర్ నేత.. రాష్ట్ర పార్టీ లైన్ కు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓపక్క బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు సీరియస్ గా మారిన వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఆటలో అరటి పండులా వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.