Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డి ఫైర్‌... కేసీఆర్ స‌హా అంద‌రూ స‌మైక్య‌వాదులే అని వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   1 May 2022 4:30 AM GMT
జ‌గ్గారెడ్డి ఫైర్‌... కేసీఆర్ స‌హా అంద‌రూ స‌మైక్య‌వాదులే అని వ్యాఖ్య‌లు
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి మ‌ళ్లీ లైన్‌లోకి వ‌చ్చేశారు. హాట్ కామెంట్ల‌తో మ‌ళ్లీ హీటెక్కించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ.. ఓయూ విద్యార్థులను కలిసేందుకు రాహుల్ గాంధీకి అనుమతిస్తారా.. లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ను యూనివర్శిటీకి తీసుకెళ్తారా అని టీఆర్ ఎస్‌ నేతలకు సవాల్ విసిరారు. ఓయూలోకి రాజకీయ నాయకులు వెళ్లొద్దని జీవో ఇప్పుడే విడుదల చేశారని ప్రశ్నించారు. సీఎం విద్యార్థులను కలిసి వారి కష్టాలు తెలుసుకోవాలన్నారు.

రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు వస్తున్నాడని జీవో విడుదల చేశారా అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి యూనివర్శిటీకి ఎందుకెళ్లలేదని నిలదీశారు. మీరు సీఎంను ఓయూ తీసుకెళ్తారా.. లేదా రాహుల్ గాంధీ పర్యటనుకు అనుమతిస్తారా అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు.

తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు నేరుగానే మాట్లాడతానని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్‌ను ఉరికిచ్చి కొడతానన్న టీడీపీ అప్ప‌టి నేతలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు కాదా అని ప్రశ్నించారు. ``టీఆర్ ఎస్ ప్రభుత్వం యూనివర్శిటీలను గాలికొదిలేసింది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటన ఎందుకు వద్దంటున్నారు? రాహుల్ వస్తున్నందుకే జీవో బయటకు వచ్చిందా? ఈ రోజే ఆ జీవోను ఎందుకిచ్చారు?`` అని నిల‌దీశారు.

సమైక్య రాష్ట్రంలో ఓయూకు ఎవరైనా వచ్చేవారు. తెలంగాణ వచ్చాక యూనివర్శిటీలోకి వెళ్లకూడదా? విద్యార్థులను కలిసేందుకు మా నాయకుడు వెళ్తే మీకేంటీ? ఓయూ మొత్తం పోలీసులకు అప్పగించిర్రు. కేసీఆర్ ఇప్పటివరకు ఓయూకు ఎందుకు వెళ్లలేదు? ఓయూకు వెళ్తే విద్యార్థుల ఆగ్రహానికి గురి అవుతారనే భయపడి పోలేదు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిస్తారా.. లేదా మీ ముఖ్యమంత్రిని ఓయూకు తీసుకెళ్తారా? అని జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు.

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసలైన సమైక్యవాదులే కదా అని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్‌ కార్యకర్తలను ఉరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు అదే పార్టీలోనే ఉన్నారు కదా ఎద్దేవా చేశారు. ఈ జాబితా పరిశీలిస్తే టీఆర్ ఎస్‌ ప్రభుత్వంలో ఉన్న సమైక్యవాదులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న నేతలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పరోక్షంగా సమైఖ్యవాదులే కదా అని జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.