Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్ పీకాడా?

By:  Tupaki Desk   |   6 April 2022 3:30 PM GMT
జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్ పీకాడా?
X
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ అసమ్మతి రాజేస్తున్న సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎట్టకేలకు తన డిమాండ్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతూ తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్లతో కలిసి రాజకీయం చేస్తున్న జగ్గారెడ్డితో తాజాగా రాహుల్ గాంధీ భేటి అయ్యారు. ఈ క్రమంలోనే భేటి తర్వాత పూర్తిగా మారిపోయారు. చిలక పలుకులు పలికారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నారు.

రాహుల్ గాంధీ మెసేజ్ విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో భేటి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఏవిధంగా నిలదీయాలి? ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలనే దానిపై రాహుల్ గాంధీ చర్చించారు.

ఈ సందర్భంగా 3 పార్టీలను ఎదుర్కోవాలని రాహుల్ దిశానిర్ధేశం చేశారని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ తో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయానని తెలిపారు. దీన్ని బట్టి రాహుల్ గాంధీ గట్టిగానే క్లాస్ పీకాడని.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వెళుతున్న జగ్గారెడ్డికి హితబోధ చేశాడని అర్థమవుతోంది.

పాత విషయాలన్నీ మరిచిపోయానని.. కాంగ్రెస్ ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండవన్నారు. కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో మీరే చూస్తారని జగ్గారెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీతో ఫొటో దిగి పాత పగలన్నీ జగ్గారెడ్డి మరిచిపోయారు.