Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డికి అధిష్టానం భారీ షాక్‌.. ప‌ద‌వి పోయింది!

By:  Tupaki Desk   |   21 March 2022 3:30 PM GMT
జ‌గ్గారెడ్డికి అధిష్టానం భారీ షాక్‌.. ప‌ద‌వి పోయింది!
X
లేస్తే.. మ‌నిషిని కాద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, తెలంగాణ కాంగ్రెస్ కీల‌క నేత‌.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయనకు అప్పగించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా జగ్గారెడ్డిని తప్పించినట్లు పీసీసీ పేర్కొంది. ఆయనకు గతంలో అప్పగించిన బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఈ ప‌రిణామం.. జ‌గ్గారెడ్డికి భారీగా షాక్ ఇచ్చిన‌ట్టే అయింద‌ని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు. గ‌త కొద్ది నెల‌లుగా జగ్గారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పై తీవ్ర‌స్తాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఆయ‌న తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌పైనా తీవ్రంగా మండిపడుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌ హోటల్‌ అశోకలో కాంగ్రెస్‌ విధేయుల గ్రూప్‌ పేరుతో సమావేశం నిర్వహించారు. మర్రి శశిధర్‌రెడ్డి, వి.హన్మంతరావుతో కలిసి భేటీ అయ్యారు.

వాస్త‌వానికి ఈ స‌మావేశం వ‌ద్ద‌ని పేర్కొంటూ పీసీసీ వారించినా వినకుండా జ‌గ్గారెడ్డి భేటీ కొనసాగించారు. తనను సస్పెన్షన్‌ చేసినా భయపడేది లేదని.. రోజుకొకరి వ్యవహారాలు బయటపెడతానంటూ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

అంతేకాదు.. తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని.. రేవంత్‌రెడ్డి త‌న మ‌నిషిని పెట్టి గెలిపించుకోవాల‌ని.. స‌వాల్ చేశారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డి చెబితే.. తాము వినాలా.. తాము సీనియ‌ర్ల‌మే.. అని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించింది.

వీహెచ్‌పైనా వేటు?

వద్దని చెప్పినా మీడియా సమావేశం నిర్వహించడంపై ఏఐసీసీ ఆగ్రహంగా ఉంది. మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీపై కాంగ్రెస్ పెద్దలు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్‌కు లాయల్టీగా చెప్పుకునే నేతలు.. రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించడంపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చ‌ర్య‌లు తీసుకున్న అధిష్టానం.. ఇప్పుడు వీహెచ్‌పైనా దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రెండ్రోజుల్లో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు తెలంగాణకు రానున్నారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి బోస్‌రాజు మాట్లాడుతారని చెబుతున్నారు. బోస్‌రాజు వచ్చే వరకు షోకాజ్ నోటీస్ ఇస్తారా.. లేదా అనేది సస్పెన్స్‌గా మిగిలింది. షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెప్తామని వీహెచ్‌ అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.