Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో జగ్గారెడ్డి తెగదెంపులు ఖాయమేనా? సహచరులపై మళ్లీ నిప్పులు

By:  Tupaki Desk   |   20 March 2022 2:30 PM GMT
కాంగ్రెస్ తో జగ్గారెడ్డి తెగదెంపులు ఖాయమేనా? సహచరులపై మళ్లీ నిప్పులు
X
చూడబోతుంటే కాంగ్రెస్ పార్టీతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెగదెంపులు ఖాయమేనా? అన్నట్లు కనిపిస్తోంది. నెల కిందట కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ కలకలం రేపిన జగ్గారెడ్డి తర్వాత కాస్త శాంతించారు. అధిష్ఠానం నుంచి పిలుపు వస్తుందని వేచి చూస్తున్నారు. ఈ నెల 21 న అంటే సోమవారం సంగారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, అదేమీ కదలిక లేదు.

మరోవైపు ఐదు రాష్ట్రాల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ మరింత డీలా పడింది. ఇటు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్లు గత ఆదివారం ప్రత్యేకంగా మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. జగ్గారెడ్డి, వీహెచ్, గీతారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పీసీసీ
చీఫ్ రేవంత్ తీరుపై విమర్శలు చేశారు. తమను కలుపుకొని వెళ్లడం లేదని.. సోనియా, రాహుల్ కు లేఖ రాస్తామని తెలిపారు.

అయితే, పీసీసీ చీఫ్ రేవంత్ అంతకుముందు రోజు కొల్లాపూర్ లో నిర్వహించిన సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమ పార్టీ నేతలను ఉద్దేశించి చేసినట్లే ఉన్నాయని సీనియర్లు పేర్కొనడం గమనార్హం. ఆ విషయం వదిలేస్తే ఆదివారం సీనియర్లు మళ్లీ భేటీ అయ్యారు. దీన్నిబట్టి కాంగ్రెస్ లో ఏదో జరుగబోతోందనే అంచనాలు కనిపిస్త్త్తున్నాయి. అటుచూస్తే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారు.

దీనికితగ్గట్లుగా కేంద్రంపై తొలుత వరి ధాన్యం కొనుగోలు అంటూ యుద్ధం చేసి ప్రజలను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ముందుగానే ఎన్నికలు నిర్వహించి కేటీఆర్ ను సీఎం చేసి తాను జాతీయ రాజకీయాలపై కన్నేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.

అందుకనే ఆయన రాజకీయంగా పావులు కదుపుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాగూ వరి అంశంలో బద్నాం చేస్తూ.. రాష్ట్రంలో సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్ ను చికాకు పెట్టాలనేది కేసీఆర్ వ్యూహం. అందుకనే కీలక నేతలను వలలోకి లాగుతున్నారు.

కాగా, ఇప్పటికే ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఇందుకు తగ్గట్లే కనిపిస్తోంది. మరోవైపు జగ్గారెడ్డి ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. తమకు పార్టీ షోకాజ్‌ నోటీస్‌ ఇస్తే సమాధానం చెబుతామని.. సస్పెండ్‌ చేసే దమ్ము ఎవరికీ లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనను సస్పెండ్‌ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడతానని హెచ్చరించారు.

అశోక హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల 'ప్రత్యేక' భేటీ ముగిసిన అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ''సస్పెండ్‌ చేసినా అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటా. రేవంత్‌ నా సవాలు స్వీకరిస్తే నేను రాజీనామా చేస్తా. నా స్థానంలో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే రేవంత్‌ హీరో అని ఒప్పుకుంటా.

నేను గెలిస్తే నేను హీరో, ఇద్దరం ఓడితే ఇద్దరం జీరోలమే. పార్టీ సిద్ధాంతంలో రేవంత్‌ పని చేయడం లేదు. వీహెచ్‌ తన కూతురు సమస్యపై హరీశ్‌రావును కలిస్తే తప్పేంటి?'' అని జగ్గారెడ్డి నిలదీశారు. పీసీసీ చీఫ్ పై మరోసారి జగ్గారెడ్డి గురిపెట్టడం చూస్తుంటే ఆయన ఏమైనా తేల్చుకునేందుకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది.