Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ లో చేరికకు జగ్గారెడ్డికి సందు దొరికిందా?

By:  Tupaki Desk   |   10 March 2022 3:30 PM GMT
టీఆర్ఎస్ లో చేరికకు జగ్గారెడ్డికి సందు దొరికిందా?
X
సీఎం కేసీఆర్ తీరే వేరు. ఆయన తనను తిట్టిన వారినే తిరిగి పార్టీలో చేర్చుకొని అందలం ఎక్కించడం ఆయనకు అలవాటు.. టీడీపీలో ఉండగా.. కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావులకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చిన గౌరవిచ్చిన ఘనత కేసీఆర్ దే. ఇక మోత్కుపల్లి నర్సింహులు అయితే కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. ఆయనను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు మరో తిట్ల నేతను కూడా టీఆర్ఎస్ లోకి చేర్చుకోబోతున్నారు.

కేసీఆర్ మంత్రిమండలిలో చాలా మంది గతంలో ఆయనను తిట్టినవారే. ఇప్పుడు ఆ తిట్ల వర్షం కురిపించిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం కేసీఆర్ ఆహ్వానించడం విశేషం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక అలకబూని అసమ్మతి రాజేసి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న జగ్గారెడ్డి తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరాడు. దానికి కేసీఆర్ సరేనని భేటికి సిద్ధం కావడంతో జగ్గారెడ్డి పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే తాను టీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదని.. అసలు అలాంటి సంప్రదింపులు ఏవీ జరగలేదని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కు హాజరైన జగ్గారెడ్డి, వాకౌట్ చేసి మరోసారి చర్చకు తావిచ్చారు. కాంగ్రెస్ లో ఉండలేనంటున్నారు. బయటకు వెళ్లలేనంటున్నారు. ఇదెక్కడి గొడవ అంటూ మిగతా నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన కేసీఆర్ ను జగ్గారెడ్డి మెచ్చుకున్నారు. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు. మధ్య తరగతి ప్రజలకు ఇంటి నిర్మాణంలో ఆర్థిక సాయం చేస్తున్న పెద్ద మనసు కేసీఆర్ ది అంటూ పొగిడేశారు. కేసీఆర్ ను నేరుగా అభినందించి ఆయన అపాయింట్ మెంట్ అడిగారు. అలా తిట్టిన వారిపై అంతులేని ప్రేమ కురిపించడానికి కేసీఆర్ ఎప్పుడూ సిద్ధమే. అలా జగ్గారెడ్డిని కూడా తన పార్టీలో కలపడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు.