Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డి రాజీనామా వాయిదా.. కారణమిదే?

By:  Tupaki Desk   |   20 Feb 2022 9:32 AM GMT
జగ్గారెడ్డి రాజీనామా వాయిదా.. కారణమిదే?
X
టీఆర్ఎస్ లో చేరాలనుకుంటే సింగిల్ ఫోన్ చాలని.. కానీ నా గేమ్ స్టార్ట్ అయ్యిందని.. సింగిల్ ఆట నాకు ఇష్టం అని.. నా ఆట చూపిస్తానని జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి ఆయన కొత్త పార్టీ దిశగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ లో అసమ్మతి రాజేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధమైన జగ్గారెడ్డి తాజాగా తన రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగ్గారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు సమస్య మూలాలను తెలుసుకోవట్లేదని.. టీకప్పులో తుఫాన్ అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు తనకు సర్ది చెబుతున్నారని.. నా మీద దుష్ప్రచారం జరుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలను కలిస్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నానని.. ఢిల్లీ అపాయింట్ మెంట్ కోసం మా సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారని.. అవకాశం వస్తే వెళ్లి కలుస్తానని జగ్గారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సమస్యల గురించి 15 రోజులు మాట్లాడానని.. మా పెద్దల మాటలను గౌరవించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని.. జగ్గారెడ్డి సమస్య కుటుంబ సమస్య అని పీసీసీ అనడం సహజమన్నారు.

నేను ఆట ప్రారంభించానని.. వేచిచూడాలని.. నా వెనుక ఎవరూ లేరని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు వచ్చి కలిసినా పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. పులి లాంటి నేను ఎలుకలతో పోట్లాడనని జగ్గారెడ్డి అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ .. మహారాష్ట్ర పర్యటనపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. మహారాష్ట్ర సీఎంతో కలవడం ముఖ్యమైన అంశమేనని.. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారని.. బీజేపీతో బాగా సంబంధం ఉందనే ప్రచారం నుంచి బయటపడాలని కేసీఆర్ ఎత్తుగడ అని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ ముద్ర నుంచి బయటపడే పనిలో కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.