Begin typing your search above and press return to search.

ఉత్తమ్ దే నడిచింది.. కాంగ్రెస్ సీనియర్ల గుస్సా..

By:  Tupaki Desk   |   12 Nov 2018 8:16 PM GMT
ఉత్తమ్ దే నడిచింది.. కాంగ్రెస్ సీనియర్ల గుస్సా..
X
కాంగ్రెస్ అధిష్టానం మోసం చేసింది. ఒక్క కుటుంబానికి ఒక్కటే సీటు అని బీరాలు పలికి కొందరు బడా, ఆర్థిక అండదండలున్నా కాంగ్రెస్ సీనియర్లపై ప్రేమ కురిపించింది. నిబంధనలను తోసిరాజని వారి కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఆయనకు హుజూర్ నగర్, ఆయన భార్య పద్మావతికి కోదాడను కట్టబెట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నల్గొండలో బలమైన కోమటిరెడ్డి బ్రదర్స్ కు కూడా కాంగ్రెస్ రెండు టికెట్లు ఇవ్వడం విశేషం.. ఇక్కడ నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అవకాశం కల్పించింది. ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న భట్టి విక్రమార్క ఫ్యామిలీ నుంచి మల్లు రవికి జడ్చర్ల టికెట్ కేటాయించి ఆశ్చర్యపరిచింది.

అయితే కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా ఉన్న జానారెడ్డి తన కుమారుడికి మిర్యాల గూడ సీటు ఆశించగా కాంగ్రెస్ మొండిచేయి చూపింది. కాంగ్రెస్ సీనియర్ నే పెడచెవిన పెట్టడంతో ఆయన మనస్థాపం చెందారని సమాచారం. ఈయనకే కాదు.. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ లు కూడా రెండు సీట్లు ఆశించారు. వారి ఫ్యామిలీ మెంబర్ల కోసం ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేకపోయింది. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి వ్యక్తమవుతోంది..

ముఖ్యంగా కొండా సురేఖ రెండు సీట్ల హామీతోనే కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు పరకాల ఇచ్చి .. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్ తూర్పును కేటాయించకపోవడంతో షాక్ కు గురయ్యారట.. ఇక దామోదర భార్యకు కూడా సీటు ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదట.. ఇలా కొందరిపై కాంగ్రెస్ అధిష్టానం వల్లమాలిన ప్రేమ కురిపించి.. మరికొందరిపై సవితి ప్రేమ చూపించడంపై నేతలు మండిపడుతున్నారు. ఇస్తే అందిరికీ ఇవ్వాలని.. లేదంటే ఎవ్వరికీ ఇవ్వవద్దని గళం విప్పుతున్నారు. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి..