Begin typing your search above and press return to search.

వంద స‌భ‌లు..హెలీకాప్ట‌ర్ హోరు..రేవంత్ జోరు

By:  Tupaki Desk   |   26 Nov 2018 11:13 AM GMT
వంద స‌భ‌లు..హెలీకాప్ట‌ర్ హోరు..రేవంత్ జోరు
X
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కీల‌క స‌మ‌యంలో తీపిక‌బురు ద‌క్కింది. పోలింగ్‌ కు కొద్దిరోజుల ముందు ఆయ‌న ఎన్నిక‌ల క‌మిష‌న్ రూపంలో గుడ్ న్యూస్‌ ద‌క్కింది. హెలికాప్టర్ ద్వారా ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ప్రచారానికి వస్తున్నందున జిల్లాల్లో ల్యాండింగ్ కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 2 వరకు 28 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అదిలాబాద్ - ఖమ్మం - వరంగల్ - కరీంనగర్ - నల్లగొండ - మహబూబ్ నగర్ జిల్లాల ఎన్నికల ప్రచారాన్ని హెలికాప్టర్ ద్వారా నిర్వహించనున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హెలికాప్టర్ లను వినియోగిస్తున్నారు. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో రేవంత్ రెడ్డి కూడా తన ప్రచారానికి హెలికాప్టర్ ను వినియోగించబోతున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా బరిలోకి దిగుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అనుమతి ఇచ్చారు. రేవంత్ ప్రచారానికి కావాల్సిన హెలికాప్టర్ ను కూడా ఏఐసీసీ ఏర్పాటు చేసింది. కొడంగల్ లోని రేవంత్ నివాసంలో దీనికోసం ఓ హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. తన సుడిగాలి పర్యటనలో హెలికాప్టర్ ద్వారా 28 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

కొడంగ‌ల్ నుంచి ప్ర‌చారానికి స‌న్న‌ద్ధం అవుతూ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తనకు వంద నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యత అప్పగిందని చెప్పారు.ఇందుకోసం హెలికాప్టర్‌ వసతి కల్పించారని తెలిపారు. కేసీఆర్‌ ను అధికారంలోకి తెచ్చుకోవడానికి అడ్డదారిలో పయనిస్తున్న వారి వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం కొనసాగిస్తానన్నారు.