Begin typing your search above and press return to search.

రాహుల్ నాయకత్వానికి చివరి పరీక్షా ?

By:  Tupaki Desk   |   15 July 2022 11:00 AM IST
రాహుల్ నాయకత్వానికి చివరి పరీక్షా ?
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి నాయకత్వానికి చివరి పరీక్షగా పాదయాత్రను ఎంచుకున్నట్లున్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీజయంతి రోజునుండి రాహుల్ భారతదేశ వ్యాప్తంగా తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత జోడో యాత్ర సాగుతుంది. 3600 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయబోతున్నారు. 148 రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో 12 రాష్ట్రాలు 203 నియోజకవర్గాలను కవర్ చేయబోతున్నారు.

తన పాదయాత్రలో అవకాశం ఉన్న చోట్ల సభలు, రోడ్డుషోల్లో రాహుల్ మాట్లడుతారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనకు వ్యతిరేకంగా జనాలను చైతన్యం చేయటమే రాహుల్ ముఖ్య ఉద్దేశ్యం. కాంగ్రెస్ కు దూరమైపోయిన జనాలను తిరిగా పార్టీవైపు ఆకర్షించటం కూడా కీలకమైన పాయింటే. తన పాదయాత్రను కన్యాకుమారి నుండి ప్రారంభించబోతున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన రూట్ మ్యాపును తమిళనాడు కాంగ్రెస్ నేతలు రెడీ చేస్తున్నారు.

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా జనాలు రాహుల్ ను చూడలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయంగా రాహుల్ చాలాకాలంగా ఉన్నప్పటికీ సరైన మెచ్చూరిటీని కనబరచలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై సీరియస్ గా స్పందించటం, పార్టీనేతలకు దిశా నిర్దేశం చేయటంలో రాహుల్ పూర్తిగా విఫలమవుతున్నారు. మంచి వాగ్ధాటి ఉండికూడా పార్లమెంటులో కానీ బయటకానీ రాహుల్ జనాలను ఆకట్టుకోలేకపోతున్నారు.

కారణం ఏమిటంటే రాజకీయాలను, ప్రతిపక్ష పాత్రను రాహుల్ సీరియస్ గా తీసుకోలేదు. ఇందుకనే దశాబ్దాలుగా గాంధీల కుటుంబం మాత్రమే గెలుస్తున్న అమేథీలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఏదో కేరళలోని వాయనాడు ఎంపీగా గెలిచారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పరువుపోయేదే. అలాగే ఈమధ్య జరిగిన బీహార్, బెంగాల్, యూపీ, అస్సాం లాంటి రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కాబట్టి పాదయాత్ర సక్సెస్ అయి పార్టీ మళ్ళీ పునరుత్తేజం పొందితే ఓకే లేకపోతే మాత్రం రాహుల్ ఫెయిలైనట్లే అనుకోవాలి.