Begin typing your search above and press return to search.

సీటు కావాలంటే 3 కోట్లు ఇవ్వాల్సిందే!

By:  Tupaki Desk   |   15 Nov 2018 5:08 PM GMT
సీటు కావాలంటే 3 కోట్లు ఇవ్వాల్సిందే!
X
ఓ వైపు సీట్ల పంప‌కం క‌ల‌క‌లం...మ‌రోవైపు మిత్ర‌ప‌క్షాల విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుండ‌గానే తాజాగా కాంగ్రెస్ పార్టీ మ‌రో వివాదంలో ప‌డింది. కోట్ల‌కు సీట్లు అమ్ముకుంటున్నార‌నే అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు క్యామ మల్లేష్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ టికెట్ల కోసం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ ఒక్కో నియోజకవర్గం నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తనకు ఇబ్రహీం పట్నం స్థానం కేటాయించేందుకు భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ రూ. 3 కోట్లు డిమాండ్ చేశారని స్పష్టం చేశారు. తన కుమారుడు అంజన్‌ తో పాటు మరొక సన్నిహితుడిని సాగర్ వద్దకు పంపితే.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు కన్ ఫామ్ చేస్తామని సాగర్ చెప్పినట్లు మల్లేష్ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆడియోను క్యామ మల్లేష్ ఇవాళ విడుదల చేశారు.

ఈ సందర్భంగా క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంటే టీఆర్ ఎస్సే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిందన్నారు. ``కేసీఆర్ విమర్శించే కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. సీట్ల కేటాయింపులో యాదవులు - కుమ్మరులకు అన్యాయం జరిగింది. ముడుపులు తీసుకోని కాంగ్రెస్ టికెట్లు పంచింది. స్క్రీనింగ్ కమిటీ వ్యవహారం కంచె చేను మేసినట్టు ఉంది. రాజకీయంలో ఉండి డబ్బు - వయస్సు - జీవితం పొగొట్టుకున్నాను. అధిష్టానానికి తెలియజేయాలని మీడియా ముందుకు వచ్చాను. రూ. 3 కోట్లు డిమాండ్ చేసిన విషయాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కుంతియా దృష్టికి కూడా తీసుకెళ్తే బయటపెట్టొదన్నారు. తర్వాత మాట్లాడుదామని సర్ది చెప్పారు. రూ. 5 కోట్లతో మొదలు పెట్టి రూ. 4 కోట్లకు ఫైనల్ చేస్తున్నారు. బంధువర్గానికే సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌ లో కోవర్టులు ఉన్నారు`` అని క్యామ మల్లేష్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌లో చాలా మంది బ్రోకర్లు చేరారని, డబ్బులు తీసుకొని నాలాంటి నిజమైన నాయకులకు అన్యాయం చేస్తున్నార‌ని క్యామ మ‌ల్లేష్ భ‌గ్గుమ‌న్నారు. `ఈ విషయాలు ఏవీ రాహుల్‌ గాంధీ దృష్టికి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. బ్రోకర్లు అంతా కుమ్మకై అన్నాదమ్ములకు - భార్యభర్తలకు టికెట్లు ఇప్పించుకుంటున్నారు. నేను అబద్ధం చెబితే నన్ను ఉరితీయండి. భక్త చరణ్ దాస్ కు - ఆయన్ని సమర్ధించే ఈ దొంగ నాయకులను సవాల్‌ చేస్తున్నా దమ్ముంటే ఎవరినైనా నేను చెప్పేవి అబద్దాలు అని నిరూపించండి. ఇది నిజం కాకపోతే - నన్ను ఉరితీయండి. ఇలాంటి దొంగలు పార్టీ నుంచి వెళ్లిపోతేనే స్వచ్ఛమైన కాంగ్రెస్ బతుకుతుంది. ఈ బ్రోకర్ల వ్యవహారం రాహుల్‌ గాంధీ దృష్టికి పోవాలనే మీడియా ముందు ఆడియో టేపులు విడుదల చేశాను`` అని వెల్ల‌డించారు.