Begin typing your search above and press return to search.

బ్లడ్ లోనే లేదన్నప్పుడు ఈ సాగతీత ఎందుకు కోమటిరెడ్డి?

By:  Tupaki Desk   |   31 July 2022 2:30 AM GMT
బ్లడ్ లోనే లేదన్నప్పుడు ఈ సాగతీత ఎందుకు కోమటిరెడ్డి?
X
టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కమ్ మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా ఆయన పార్టీ మారతారన్న ప్రచారం.. దానికి సంబంధించిన వార్తలు రావటం ఇప్పుడో రోటీన్ వ్యవహారంగా మారింది. కొన్ని సందర్భాల్లో తనకు తానుగానే లీకులు ఇచ్చినట్లుగా రాజగోపాల్ రెడ్డి తీరు గురించి మీడియాలో కథలు కథలుగా చెబుతుంటారు. పార్టీ మారాలనుకుంటే మారాలి.

కానీ.. తనకున్న ఇమేజ్ విషయంలో ఈ కోమటిరెడ్డి బ్రదర్ కు స్పష్టమైన అవగాహన లేకనే ఈ పాట్లుగా చెబుతారు. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవటం చాలామంది నేతల్లో కనిపిస్తుంటుంది. అందుకు ఈ మునుగోడు ఎమ్మెల్యే అతీతం కాదనే చెప్పాలి. నిత్య అసంతృప్తవాదిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఎప్పుడు ఏ పార్టీలో చేరాలన్న దాని మీదనే ఫోకస్ తప్పించి నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

అసలు వదిలి కొసరును పట్టించుకునే కోమటిరెడ్డికి.. తాను చేస్తున్న తప్పులు అర్థమవుతున్నాయా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ మారటం అనేది జరిగితే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ చెప్పిన మాటలే ఇప్పుడాయనకు గుదిబండగా మారాయని చెప్పాలి. విలువల గురించి మాటలు చెప్పటం ఎంత తేలికో.. వాటిని ఆచరణలో పెట్టటంలోనే సమస్యలు వచ్చి పడతాయి. రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు.

బీజేపీలో చేరితే లాభం ఎంత? నష్టం ఎంత? అనే లెక్కలు ఒక కొలిక్కి.. తాను పార్టీ మారినంతనే జరిగే నష్టం మీద లెక్కలు వేసుకున్న ఆయన.. ఫటాఫట్ అని తానుఅనుకున్న పని ఎందుకు చేయరన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఆయనకున్న సందేహాలే అని చెప్పాలి. పార్టీ మారే ఎపిసోడ్ ను టీవీ సీరియల్ స్థాయికి తీసుకొచ్చిన ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కాస్తా తనపై ప్రజల్లో చిరాకు.. వ్యతిరేకత ఎక్కువైతే.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన రాజగోపాల్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు.

కేసీఆర్ సర్కారు నియంత పాలనకు చరమగతతం పాడేందుకు తాను కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమని.. సమరశంఖం పూరిస్తామని చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తాను పార్టీ మారటం ద్వారా వచ్చే ఎన్నికలు కేసీఆర్ సర్కారు నియంత పాలనకు చరమగీతం ఏమిటో? ఈ కురుక్షేత్రం మాటలేందో? ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. మొత్తంగా చూస్తే.. టీవీసీరియల్ మాదిరి సాగదీస్తున్న రాజగోపాల్ రెడ్డి తాజా ప్రకటనతో ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశారని చెప్పాలి.

తాను పార్టీ మారటం ఖాయమని.. ఉప ఎన్నికకు వెళ్లబోతున్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు వీస్తున్న గాలి తనకు సానుకూలంగా లేవన్న వాదన ఆయన్ను ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు పెద్ద పెద్ద మాటల్ని ఇప్పుడు ఆయన వాడుతున్నట్లుగా చెబుతున్నారు.

డైలమా.. వెనకడుగు తన రక్తంలోనే లేదని.. సొంత అవసరాల కోసమో.. పదవుల కోసమో చేస్తున్న పోరాటం తనది కాదంటూ క్లారిటీ ఇస్తున్నారు. అయితే.. ఇదంతా మునుగోడు ప్రజల మనసుల్లో జరుగుతున్న మధనంపై అవగాహనకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి తన మాటలతో వారికి సర్దిచెప్పాలన్న ఉద్దేశంతో తాజా వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఆలస్యం అమృతం విషమన్న సామెతను రాజగోపాల్ రెడ్డి గుర్తు చేసుకుంటే మంచిదన్న మాట వినిపిస్తోంది.