Begin typing your search above and press return to search.

ట్రబుల్ షూటర్ కు ఇంకో పది రోజులు ట్రబుల్సే!

By:  Tupaki Desk   |   4 Sep 2019 3:59 PM GMT
ట్రబుల్ షూటర్ కు ఇంకో పది రోజులు ట్రబుల్సే!
X
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - ప్రత్యేకించి కర్ణాటక కాంగ్రెస్ శాఖలో ట్రబుల్ షూటర్ గా ముద్ర వేసుకున్న మాజీ మంత్రి డీకే శివకుమార్ కు నిజంగానే ఇది కష్టకాలమే. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఓ ఐదు రోజుల పాటు తనదైన శైలిలో విచారించి అరెస్ట్ చేసింది. అయితే ఈ ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో డీకే నోరే విప్పలేదని - అసలు విచారణకే సహకరించలేదని ఆరోపించిన ఈడీ... డీకేను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనతో ఏకీభవించిన ఢిల్లీ కోర్టు... 14 రోజులు వద్దులే - ఓ పది రోజుల పాటు విచారించండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అంటే... ఇప్పటికే ఐదు రోజుల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న డీకే..మరో పది రోజుల పాటు ఈడీ ఆఫీసర్లు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందేనన్న మాట.

ఆరు రోజుల క్రితం ఈడీ ముంగిట విచారణకు హాజరయ్యే ముందు... ఆ విచారణ నుంచి తప్పించుకునేందుకు డీకే ముందస్తు బెయిల్ కోసం యత్నించారు. అయితే డీకే వినతిని కోర్టు సమర్థించకపోవడంతో ఆరు రోజుల క్రితం ఆయన ఈడీ ముంగిట వాలక తప్పలేదు. అప్పటి నుంచి రోజూ విచారణ పేరిట తమ కార్యాలయానికి డీకేను రప్పించుకున్న ఈడీ అధికారులు... ఆయనకు నిజంగానే చుక్కలు చూపించారట. ఈడీ అధికారులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఒకానొక దశలో డీకే బోరున విలపించారట. ఈడీ అధికారుల ప్రశ్నలు ఎంత కఠినంగా ఉండకపోతే... నిన్న అరెస్ట్ కు ముందు తన కుటుంబ సభ్యులను చూసిన సమయంలోనూ డీకే తమాయించుకోలేక ఏడ్చేశారు.

తాజాాగా డీకే ఎంత ఏడ్చినా... నిజాలు చెప్పాల్సిందేనని - నిజాలు చెప్పేదాకా విచారణ కొనసాగుతుందన్న రీతిలో స్పందించిన ఈడీ... డీకేను కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్ ను విచారించిన కోర్టు... డీకే తరఫు న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందక డీకేను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ సంచలన తీర్పు చెప్పింది. అయితే ఈడీ కోరిన మేరకు 14 రోజుల కస్టడీ కాకుండా 10 రోజుల పాటు విచారించి పంపండి అంటూ డీకేను ఈడీకి అప్పగించింది. మొత్తంగా ఇప్పటికే ఐదు రోజుల పాటు ఈడీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన డీకే... మరో పది రోజుల పాటు మోర్ ట్రబుల్స్ ఎదుర్కోక తప్పదన్న మాట.