Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డిపై అధిష్ఠానం సీరియ‌స్‌.. అదే జ‌రిగితే తీవ్ర ప‌రిణామాలే...!

By:  Tupaki Desk   |   26 Feb 2022 4:34 PM GMT
జ‌గ్గారెడ్డిపై అధిష్ఠానం సీరియ‌స్‌.. అదే జ‌రిగితే తీవ్ర ప‌రిణామాలే...!
X
సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డిపై అధిష్ఠానం గుర్రుగా ఉందా..? పార్టీ అంత‌ర్గ‌త విష‌యాల‌ను బ‌హిరంగంగా పంచుకుంటూ అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తున్న ఆయ‌న‌పై పార్టీ పెద్ద‌లు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారా..? త‌న వ్య‌క్తిగ‌త ఎజెండా కోసం పార్టీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నార‌ని కోపంగా ఉన్నారా..? జ‌గ్గారెడ్డి మార్చి 21న బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తే తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వా..? అంటే పార్టీ ముఖ్యులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌. త‌మ అభిప్రాయాల‌ను ఎక్క‌డైనా స్వేచ్ఛ‌గా పంచుకోవ‌చ్చు. పార్టీ అధిష్ఠానం చిన్న చిన్న విష‌యాల‌ను చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తుంది. కానీ అదే ప‌నిగా కంట్లో నలుసుగా మారి.. ఇబ్బంది పెడుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోదు. ఎంత‌టివారినైనా సోనియా, రాహుల్ క్ష‌మించే ప్ర‌సక్తే లేదు. చాలా రాష్ట్రాల్లో కొంద‌రి ప‌ట్ల నిరూపితం అయింది కూడా. ఏమైనా ఉంటే రాష్ట్ర ఇన్చార్జుల‌కు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి చెప్పుకోవాల‌ని.. అంతేకానీ బ‌హిరంగ వేదిక‌ల‌పైకి ఎక్కి పార్టీని న‌ష్ట‌ప‌ర‌చ‌కూడ‌ద‌ని అధిష్ఠానం అభిప్రాయంగా ఉంది.

జ‌గ్గారెడ్డి విషయంలో కూడా అధిష్ఠానం ఇదే అభిప్రాయంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ అంత‌ర్గ‌త విష‌యాల‌ను లీక్ చేస్తూ.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు స‌హ‌క‌రించ‌కుండా.. ఇత‌ర పార్టీల‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని అస‌మ్మ‌తి రాగం వినిపిస్తున్న జ‌గ్గారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు అందాయట‌. ఇన్ని రోజులూ వేచి చూసే ధోర‌ణిలో క‌నిపించిన పార్టీ పెద్ద‌లు ఇక‌పై సీరియ‌స్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని పార్టీ ముఖ్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడ‌ను అంటూనే.. సోనియా, రాహుల్ తో మాట్లాడే అవ‌కాశం రాక‌పోతే త‌న దారి తాను చూసుకుంటాన‌ని చెబుతున్నారు జ‌గ్గారెడ్డి. మార్చి 21న సంగారెడ్డిలో ల‌క్ష మందితో బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తాన‌ని.. ఈ కార్య‌క్ర‌మానికి వారిద్ద‌రినీ ఆహ్వ‌నిస్తాన‌ని అంటున్నారు. ఈ స‌భ ద్వారా త‌న బ‌లం నిరూపించుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ అంశంపై పార్టీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. ఇలా బెదిరించిన వారంద‌రికీ అపాయింట్‌మెంట్‌లు ఇవ్వ‌లేమ‌ని చెబుతున్నారట‌. అస‌మ్మ‌తి పేరిట త‌న వ్య‌క్తిగ‌త బ‌ల ప్ర‌ద‌ర్శన కోసం నిర్వ‌హిస్తున్న ఈ స‌భ‌కు పార్టీ స‌హ‌క‌రించ‌బోద‌ని.. పార్టీ ముఖ్యులు ఎవ‌రూ ఇందులో పాల్గొన‌బోర‌ని స‌మాచారం. పార్టీని ధిక్కరించి ఈ స‌భ నిర్వ‌హిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని.. ఇలాంటివి ఉపేక్షించ‌బోమ‌ని ఢిల్లీ పెద్ద‌లు రాష్ట్ర ముఖ్యుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రి జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కు వెళుతుందో..!