Begin typing your search above and press return to search.

సిద్ధూ భార్య క్లారిటీ ఇచ్చేశారు!

By:  Tupaki Desk   |   15 Aug 2016 4:22 AM GMT
సిద్ధూ భార్య క్లారిటీ ఇచ్చేశారు!
X
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కి సంబందించిన ఒక విషయం రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 2004 - 2009లలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సిద్ధూ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోసం ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు. దాంతో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సిద్దూ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మోడీకి, బీజేపీ కి షాక్ ఇచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇందుకు ఆప్ తో ఆయనకున్న స్నేహము - ప్లాన్లే కారణమని వినిపించాయి.

ఈ విషయంలో ఈ మాజీ క్రికెటర్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతున్నారని, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను ఆప్ ఎంపిక చేయనుందని వార్తలు వచ్చాయి. ఈ గాసిప్పులపై సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ క్లారిటీ ఇచ్చారు. సిద్ధూ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం చాలా పార్టీలు తమను సంప్రదించాయని.. వాటిలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఉందని తెలిపారు. ఈ విషయంపై.. ఆ పార్టీలో చేరే విషయాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బాదల్‌ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్‌ పార్టీకి - అమరేందర్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద వ్యత్యాసం లేకపోవడమే ఆ నిర్ణయానికి కారణమని.. ఆ రెండూ పార్టీలూ అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించిన నవజ్యోత్ కౌర్.. ఎటువంటి మచ్చలేని ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధూ సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో సిద్ధూ ఆప్ లో చేరబోతున్నారని ప్రకటించారు.

సిద్దూ ఆప్ లో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని.. అన్నీ అనుకూలంగా జరిగితే కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ లోకి వచ్చే వారంలో సిద్ధూ అధికారికంగా చేరే అవకాశం ఉందని నవజ్యోత్ కౌర్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా.. రెజ్లర్ ది గ్రేట్ ఖలీ పంజాబ్ రాష్ట్రంనుంచి ఇప్పటికే ఆప్ లో చేరిన సంగతి తెలిసిందే.