Begin typing your search above and press return to search.

అక్కడ ఒక్కసారి గెలిస్తే హ్యాట్రిక్కే...

By:  Tupaki Desk   |   7 Oct 2018 2:05 PM IST
అక్కడ ఒక్కసారి గెలిస్తే హ్యాట్రిక్కే...
X
ఎన్నికల వేళ అన్ని పార్టీల చూపు ఆ నియోజకవర్గం పైనే ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్కసారి గెలిస్తే వరుసగా విజయాలను కట్టబెడతారు ఓటర్లు. దాంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం.

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరని ఓటింగ్ ఉంది. ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 1954లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన అభ్యర్థులందరూ దాదాపు వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఏడుసార్లు కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక్కసారి టీడీపీ గెలిచింది.

గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన డీఎస్ రెడ్యానాయక్ 1989 నుంచి 2004 వరకు కాంగ్రెస్ తరుపున పోటీ చేసి వరుస విజయాలను సాధించారు. 2009లో సత్యవతి రాథోడ్ టీడీపీ తరుపున బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తరువాత 2014లో ఆమె ఓడిపోయారు. రెడ్యానాయక్ మళ్లీ గెలుపొందారు.

రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లో చేరిపోయారు ఎమ్మెల్యే రెడ్యానాయక్. సత్యవతి రాథోడ్ కూడా గులాబీ కండువా కప్పుకోవడంతో బరిలో నిలిచేదెవరనే సందేహాలకు గులాబీ బాస్ కేసీఆర్ తెరదించారు. ఈ సారి కూడా రెడ్యానాయక్ కు టిక్కెట్ కేటాయించేయడంతో సత్యవతి రాథోడ్ అసమ్మతిగా మారిపోయారు. ఆమె పార్టీ వీడి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న డోర్నకల్ పై ఉమ్మడి కూటమి ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. సంపదాయ ఓటింగ్ ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సత్యవతి కాంగ్రెస్ లో చేరి విజయాన్ని అందుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డోర్నకల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస విజయాలను అందుకుంటూ వచ్చింది. ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ క్రమంలో డోర్నకల్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో ఇరు పార్టీలు లెక్కలు వేసుకునే పడిపోయారు. టీఆర్ ఎస్ గెలుపునకు అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయో బేరీజు వేసుకుంటున్నారు.