Begin typing your search above and press return to search.

రిప‌బ్లిక్ టీవీ సంచ‌ల‌న క‌థ‌నంలో ఏముంది?

By:  Tupaki Desk   |   7 April 2018 4:33 AM GMT
రిప‌బ్లిక్ టీవీ సంచ‌ల‌న క‌థ‌నంలో ఏముంది?
X
ఏపీ ప్ర‌త్యేక హోదా అంశం ఏపీని మాత్ర‌మే కాదు.. జాతీయ స్థాయిలోనూ ఇదో పెద్ద అంశంగా మారుతోంది. హోదా అంశంపై మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్ స‌భ‌లో వ‌రుస‌పెట్టి పెట్టినా.. చ‌ర్చ‌కు రాకుండా చేయ‌టం ద్వారా మోడీ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. స‌భ జ‌ర‌గ‌కున్నా.. త‌న‌కు అవ‌స‌ర‌మైన బిల్లుల్ని మాత్రం ఆమోదించుకున్న వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

తానేం చేయాల‌నుకున్నానో అదే చేస్తూ.. విప‌క్షాల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌ని మోడీపై అన్ని పార్టీలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇలాంటివేళ‌.. కాంగ్రెస్‌.. ఎన్సీపీ.. టీడీపీ అధినేత‌లు క‌లిసి భారీ ప్లాన్ ఒక‌టి వేసిన‌ట్లుగా రిప‌బ్లిక్ టీవీ ఛాన‌ల్ ఒక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. దీని ప్ర‌కారం వివిధ పార్టీల‌కు చెందిన వంద‌మంది ఎంపీలు మూకుమ్మ‌డిగా రాజీనామా చేయ‌టం ద్వారా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో హైప్రొఫైల్ స‌మావేశాల్లో భాగంగా కొన్ని కీల‌క సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లుగా రిప‌బ్లిక్ ఛాన‌ల్ పేర్కొంది.హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయ‌టం.. మీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారా? అంటూ జ‌గ‌న్ స‌వాలు విసిరిన నేప‌థ్యంలో రానున్న రోజుల్లో రాజ‌కీయం ఎలా ఉంటుంద‌న్న అంశంపై క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం అంటూ ప్ర‌సార‌మైన ఈ క‌థ‌నంలో విప‌క్షాలు ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాయో చూస్తే..

+ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాల్ని సొమ్ము చేసుకోవాలంటే ముంద‌స్తు ఎన్నికలు అవ‌స‌రం. అందుకు అవ‌స‌ర‌మైన వేదిక‌ను సిద్దం చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా మూకుమ్మ‌డి రాజీనామాలు. ఇందులో భాగంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా.. పీఎన్ బీ కుంభ‌కోణం.. ఎస్సీ.. ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన స‌మాచారం.. కావేరీ జ‌లాల పంప‌కం వివాదం లాంటి అంశాల‌తో గ‌తం కంటే ఎక్కువ సీట్ల‌ను గెలుచుకోవ‌చ్చ‌న్న‌ది విపక్షాల ఆలోచ‌న‌

+ గ‌త సార్వ‌త్రికంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన సీట్ల కంటే ఎక్క‌వ సీట్ల‌లో గెలిచిన బీజేపీకి ధీటుగా.. మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్ప‌డి స‌త్తాను చాట‌టం

+ త‌దుప‌రి సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. అన్ని విప‌క్షాలు వ‌ర్సెస్ మోడీ అన్న‌ట్లుగా జ‌రుగుతాయి. అన్ని అంశాల్ని ఒకేసారి లేవ‌నెత్త‌టం ద్వారా మోడీని ఇరుకున‌పెట్ట‌టం ద్వారా ఆయ‌న‌పై గెలుపు సాధించాల‌న్న ఆలోచ‌న‌.