Begin typing your search above and press return to search.

అల్లుడి కేసులో రిటైర్డ్ జడ్జికి బీజేపీ లంచం ఇస్తుందట

By:  Tupaki Desk   |   1 July 2016 10:04 AM IST
అల్లుడి కేసులో రిటైర్డ్ జడ్జికి బీజేపీ లంచం ఇస్తుందట
X
అత్తమ్మ చేతిలోని పవర్ రిమోట్ పుణ్యమా అని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన అల్లుడుగారు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూ వివాదాలపై బీజేపీపై కాంగ్రెస్ ఎదురుదాడిని మొదలెట్టింది. తమ పార్టీ అధినేత్రి అల్లుడిని ఏదో రకంగా బద్నాం చేయాలన్నదే ఉద్దేశంతోనే అధికార బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జడ్జి మీదే ఆరోపణలు చేయటం గమనార్హం.

గుర్ గావ్ భూముల కుంభకోణంలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వీటిపై రిటైర్డ్ జడ్జి ఎస్ ఎన్ ధింగ్రా నేతృత్వంలో ఒక ప్యానల్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్ ఎదుట హాజరైన వాద్రా.. ఆ తర్వాతి రోజున తనను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా సోషల్ మీడియాలో రాసుకున్నారు. తన మీద అక్కసుతో ఆరోపణలు చేస్తారని.. అందుకు తగ్గ ఆధారాలు ఉండవన్న మాటను చెప్పి.. తనకేమీ కాదన్నట్లుగా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలోనే.. కాంగ్రెస్ నేతలు మైక్ అందుకొని జస్టిస్ ధింగ్రా మీద అవినీతి ఆరోపణలు చేయటమే కాదు.. వాద్రాను ఏదోలా దోషిగా తేల్చాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆయన్ను వివిధ రూపాల్లో లొంగదీసుకుంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఒక ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

జస్టిస్ ధింగ్రా కీలకభూమిక పోసిస్తున్న ఒక ట్రస్ట్ ఆధ్వరంలో నడుస్తున్న స్కూలుకు ప్రభుత్వం రోడ్డు వేయటమే నిదర్శనంగా చెబుతున్నారు. వాస్తవానికి ధింగ్రా ప్యానల్ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆర్నెల్లు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈఅంశాన్ని ప్రస్తావిస్తున్న హర్యానా సీనియర్ కాంగ్రెస్ నేత.. ఎమ్మెల్యే అజయ్ యాదవ్ (ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అల్లుడిగారికి అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.