Begin typing your search above and press return to search.

ప్రత్యర్థులపై ఆ సీఎం డైరెక్ట్ అటాక్

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:28 AM GMT
ప్రత్యర్థులపై ఆ సీఎం డైరెక్ట్ అటాక్
X
చేతిలో ఉన్న అధికారాన్ని చేజార్చుకోవటానికి ఏ ముఖ్యమంత్రి ఒప్పుకోరు. అందులోకి తమకు ముప్పుగా పరిణమించే ప్రత్యర్థి విషయంలో ఏ అధినేత చూస్తూ ఊరుకోరు. ఉరకలెత్తే ఉత్సాహంతో దూసుకెళదామన్నట్లుగా ఉండే పార్టీల పట్ల అనుక్షణంఅప్రమత్తంగా ఉండటం సహజమే. తాజాగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయటానికి ఆమ్ ఆద్మీతో సహా.. కాంగ్రెస్ లు దృష్టి సారించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అలెర్ట్ అవుతున్నారు.

పంజాబ్ లో విజయం మీద ఈ మధ్యకాలంలో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని తేలిగ్గా తీసుకోమన్న సంకేతాలు ఇచ్చేలా అకాలీదళ్ అధినేత భావోద్వేగ కత్తిని బయటకు తీశారు. తన నోటి మాటలతో ప్రత్యర్థుల్ని డిఫెన్స్ లో పడే ప్రయత్నం షురూ చేయటంతో పాటు.. పంజాబీల్లో వ్యతిరేకత పెంచే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పంజాబ్ కోటలో పాగా వేయాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీపార్టీ తీరును తప్పు పడుతూ.. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలోని స్కూళ్లలో పంజాబీ భాషను బోధించటం లేదన్న విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితి తెచ్చిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీరును ప్రశ్నించటమే కాదు.. అలాంటి వారికి పంజాబ్ లో స్థానం ఉండదన్న విషయాన్ని స్పష్టం చేశారు. బైసాఖి పండక్కి సెలవును కేజ్రీవాల్ సర్కారు ప్రకటించకపోవటాన్ని ప్రస్తావించారు.

ఆమ్ ఆద్మీ పార్టీపై ఏ తీరులో అయితే భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తెచ్చారో కాంగ్రెస్ మీద అదే వ్యూహాన్ని అనుసరించారు. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కారణంగా పంజాబీలకు తగిలిన గాయాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ.. 1984లో సిక్కుల మీద జరిగిన దాడిని తాము ఎప్పటికి మర్చిపోలేమంటూ ఏ విషయాన్ని ప్రస్తావించాలో అదే విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీలు పంజాబ్ యాంటీ సిండ్రోమ్ తో బాధ పడుతున్నాయంటూ ఎద్దేవా చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్.. పంజాబ్ లో అధికారాన్ని చేపట్టేందుకు తప్పుడు ప్రమాణాలు చేస్తాయని.. పంజాబీలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు. కాంగ్రెస్.. ఆమ్ పార్టీలకు ప్రజల మీద మక్కువ లేదని.. కేవలం పార్టీని బలోపేతం చేసుకోవటమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారన్నారు. ప్రత్యర్థుల్ని దెబ్బ తీసేందుకు భావోద్వేగాన్ని నమ్ముకున్న ప్రకాశ్ సింగ్ బాదల్ ను పంజాబీలు ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.