Begin typing your search above and press return to search.

కొత్త ఉద్యోగాలు లేనట్లేనా ?

By:  Tupaki Desk   |   8 Jan 2022 12:00 PM IST
కొత్త ఉద్యోగాలు లేనట్లేనా ?
X
జగన్మోహన్ రెడ్డి తాజా నిర్ణయంతో ఇప్పుడందరిలోను ఇదే అనుమనాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును జగన్ ప్రభుత్వం 60 నుండి 62కి పెంచింది. ఐదేళ్ళ క్రితం చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ వయసును 58 నుండి 60కి పెంచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పుడైనా ఇప్పుడైనా తమ రిటైర్మెంట్ పరిమితి పెంచమని ఉద్యోగులు ఎవరు ప్రభుత్వాలను అడగలేదు.

ఉద్యోగులు అడగకుండానే వయోపరిమితి పెంచటానికి కారణాలు ఏమిటంటే రాష్ట్ర ఆర్ధికపరిస్ధితే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్ లక్షల్లో ఉంటుంది. ఒక నెలలో కనీసం 100 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారంటే వాళ్ళకు అందించాల్సిన బెనిఫిట్స్ కోట్ల రూపాయల్లో ఉంటుంది. అలాంటిడి ఏడాదిలో వెయ్యిమంది ఉద్యోగులు రిటైర్ అయితే ఎన్ని కోట్లు చెల్లించాల్సుంటుంది. ఏ కారణం వల్లకూడా ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఆపేందుకు లేదు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం మరో రెండేళ్ళకు పెంచింది. రిటైర్మెంట్ వయసు పెరగటం ఉద్యోగులకు హ్యాపీయే. కానీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల మాటేమిటి ? ఇక్కడే నిరుద్యోగులు మండిపోతున్నారు. జగన్ తాజా ప్రకటన చూసిన తర్వాత ఉద్యోగాల బర్తీ ఉండదనే విషయంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. చంద్రబాబు హయాంలో అయినా ఇపుడైనా శాశ్వత ఉద్యోగాల బర్తీకన్నా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలే జరుగుతున్నాయి.

ఈ విషయంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోవటం ఖాయం. ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితిని రెండేళ్ళు పెంచటమంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందే అవకాశంలో రెండేళ్ళు కోత విధించటమే. సరే వీళ్ళ ఒత్తిడితో నిరుద్యోగులకు కూడా దరఖాస్తలు చేసుకునేందుకు రెండేళ్ళ గడువు పెంచినా అసలు ఉద్యోగాలు బర్తీ చేస్తేనే కదా దాని ఉపయోగం.