Begin typing your search above and press return to search.

ఏపీలో ఇన్ చార్జి మంత్రుల విషయంలో కొనసాగుతున్న గందరగోళం!

By:  Tupaki Desk   |   30 Oct 2019 8:00 PM IST
ఏపీలో ఇన్ చార్జి మంత్రుల విషయంలో కొనసాగుతున్న గందరగోళం!
X
ఏపీలో ఇన్ చార్జి మంత్రుల విషయంలో గందరగోళం కొనసాగుతూ ఉన్నట్టుగా ఉంది. కేబినెట్ ఏర్పాడిన నాలుగు నెలలకే ఇన్ చార్జి మినిస్టర్ల విషయంలో మార్పులు జరిగాయి. మొదటగా ఒక్కో మంత్రికి ఒక్కో జిల్లాను అప్పగించారు. అయితే నాలుగు నెలలకే ఆ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

జిల్లాల ఇన్ చార్జిలుగా సదరు మంత్రుల పనితీరు విషయంలో అసంతృప్తితో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్పు చేర్పులు చేశారు. ఇప్పటి వరకూ వారి పనితీరును పరిశీలించి.. ఇన్ చార్జి హోదాలకు పనికి రారు అనుకున్న వారిని పక్కన పెట్టారు. మరి కొందరిని వేరే జిల్లాలకు మార్చారు. అలాంటి కసరత్తు అంతా ఇటీవలే జరిగింది.

అయితే ఇప్పుడు మళ్లీ మరో మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. ఇది ప్రకాశం జిల్లా విషయంలో. మొదటగా ఈ జిల్లాకు జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఇన్ చార్జిగా నియమించారు. నాలుగు నెలల అనంతరం మార్పు జరిగింది.

ఆ పరిణామాల్లో ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకాశం జిల్లా ఇన్ చార్జి మంత్రిగా వచ్చారు. అయితే ఇంతలోనే మార్పు చోటు చేసుకోవడం గమనార్హం.

తాజా మార్పుతో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపె విశ్వరూప్ ఇన్ చార్జిగా వచ్చారు. ఇలా ప్రకాశం జిల్లాకు ఇన్ చార్జి మంత్రిగా కొత్త నియామకం జరిగింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పేరుతో ఉత్తర్వులు వచ్చాయి. మొత్తానికి ఇన్ చార్జి మంత్రుల విషయంలో గందరగోళం కొనసాగుతోందా? అనే సందేహాలను కలిగిస్తున్నాయి ఈ మార్పులు!