Begin typing your search above and press return to search.

వైసీపీలో ఆ ఇద్దరూ...తగ్గేదేలే... ?

By:  Tupaki Desk   |   5 Dec 2021 12:30 PM GMT
వైసీపీలో ఆ ఇద్దరూ...తగ్గేదేలే... ?
X
వైసీపీకి అధికారంతో పాటు అన్ని అవలక్షణాలూ వచ్చేశాయి అనుకోవాలి.  నిజానికి అధికారంతో పాటు వర్గాలు వచ్చి చేరుతాయి. ఒకే పార్టీలో  కుమ్ములాటలూ స్టార్ట్ అవుతాయి. ఎంత సమర్ధ నాయకత్వం ఉన్నా ఇది తప్పనిసరి. ఎందుకంటే అధికారానికి కి ఉన్న మ్యాజిక్కే అది. ఇదిలా ఉంటే జగన్ లాంటి సుప్రీం చెప్పినా తగ్గేది లే అంటున్నారు వైసీపీ నేతలు. రాజమండ్రీలో రెండు వర్గాలు ఉన్నాయి. అవి బలంగా మారాయి. వాటిని సెట్ చేయబోయింది హై కమాండ్. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆ వర్గాలు ఇపుడు మళ్లీ కత్తులు నూరుతున్నాయి.

ఇప్పటిదాకా రెండే వర్గాలు అనుకుంటే మరిన్ని కొత్త వర్గాలు, ఆధిపత్యాలతో రాజమండ్రీలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడుతోంది. రాజమండ్రీలో ఎంపీ మార్గాని భరత్ కి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మధ్య విభేదాలు తారస్థాయి చేరాయి. ఇద్దరూ యువకులే. ఇద్దరిదీ ఉడుకు రక్తమే. దాంతోనే సమస్య మరీ జఠిలం అయిపోతోంది.

రాజాది రాజకీయ కుటుంబం. తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు వైఎస్సార్ కి ఆప్త మిత్రుడు. ఆయన మంత్రిగా కూడా అప్పట్లో పనిచేశారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన వైసీపీలో చేరి జగన్ కి పూర్తి మద్దతుగా నిలిచారు. ఆయన మరణంతో ఆ కుటుంబం మొత్తం వైసీపీతోనే ఉంటోంది. ఒక విధంగా తూర్పున జక్కంపూడి ఫ్యామిలీ ధీటైన మద్దతుతో వైసీపీ జెండా పాతింది అన్నది నిజం. దాంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న తనకే హవా ఉండాలన్నది రాజా గట్టి మాట.

ఇక భరత్ లేటెస్ట్ గా పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చినా ఆయన తండ్రి బీసీ సంఘాల నేతగా ఉన్నారు. జగన్ బీసీ నినాదంతో భరత్ కి అదృష్ట రేఖ వరించి వచ్చింది. భరత్ ఏకంగా ఫస్ట్ ఎంట్రీతో పార్లమెంట్ మెంబర్ అయిపోయారు. అంతే కాదు అక్కడ కీలక బాధ్యతలను కూడా అప్పగించారు.  వైసీపీకి ఇటు బీసీలు ముఖ్యమే. అటు కాపులు కూడా ముఖ్యమే. ఇక్ గోదావరి జిల్లాల్లో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పెద్దగా పొత్తు కుదరదు అంటారు. ఇపుడు అది ఒకే పార్టీలో ఇద్దరు నేతల మధ్యన అతి పెద్ద రాజకీయ వివాదానికి కారణం అవుతోంది.

ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే రాజమండ్రీ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలు బాకీ ఉండిపోయాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కూడా పార్టీ భావిస్తోంది. అయితే సిటీ మీద పట్టు కోసం ఈ ఇద్దరు నేతలు పార్టీని బలహీనపరుస్తున్నారు అన్న చర్చ పార్టీలో ఉంది. గోదావరి జిల్లాల ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి వద్ద పలుమార్లు పంచాయతీలు జరిగినా రిజల్ట్  ఏమీ లేదనే అంటున్నారు. యువకులు అయిన ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వివాదంతో బంగారం లాంటి మేయర్ సీటు ఏమైనా కోల్పోతామా అన్న టెన్షన్ అయితే వైసీపీలో ఉంది.


ఇక ఆ మధ్య ఈ ఇద్దరు నాయకులు ఒకరిని ఒకరు బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. అయితే జగన్ వారిని పిలిచి గట్టిగానే క్లాస్ తీసుకున్నారని టాక్. దాంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న వీరు మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతున్నారుట. ఇది వీరి వరకూ పరిమితం కాలేదు, వీరి వర్గంలోనూ అదే సీన్ ఉంది. ఇక అటు ఎంపీతో, ఇటు ఎమ్మెల్యేతో పడలేని వారు సొంత వర్గాలను తయారు చేసుకుంటున్నారని టాక్. ఆ విధంగా చూస్తే రాజమండ్రీలో కీలకనేత  ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అయిన శివ రామసుబ్రమణ్యంతో  పాటు రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఇలా ఎవరికి వారు ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకోవడంతో బలమైన  వైసీపీ అక్కడ చిరిగి చేటగా మారుతోంది అంటున్నారు.

దీంతో రాజమండ్రీ టీడీపీకి రొట్టె విరిగి నేతిలో పడుతోంది అంటున్నారు. అసలే అక్కడ టీడీపీ బలంగా ఉంది. దానికి తోడు అన్నట్లుగా అధికార పార్టీ కుమ్ములాటలు టీడీపీకి వరంగా మారబోతున్నాయి అంటున్నారు. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన టీడీపీకే మళ్లీ చాన్స్ దక్కినా దక్కవచ్చు అంటున్నారు.