Begin typing your search above and press return to search.

పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ ముందస్తు ‌ బెయిల్ !

By:  Tupaki Desk   |   1 Aug 2020 4:20 PM IST
పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ ముందస్తు ‌ బెయిల్ !
X
టీడీపీ కీలక నేత , మాజీమంత్రి పరిటాల సునీత తనయుడు, రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ ఓ కేసు విషయంలో శుక్రవారం రామగిరి పోలీస్‌ స్టేషన్ ‌లో హాజరయ్యారు‌. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్య‌క్తిని కిడ్నాప్ చేసి, తీవ్రంగా కొట్టాడ‌నే అభియోగాల‌పై శ్రీరామ్ పై కేసు నమోదు అయింది. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి త‌మ ఊరికి వ‌చ్చాడ‌ని, అందుకు స‌హ‌క‌రించిన వ్య‌క్తిపై ప‌రిటాల శ్రీరామ్ రౌడీయిజం చేశాడ‌ని కేసు నమోదు అయింది.

రామగిరి సీఐ జీటీ నాయుడు, ఎస్ ‌ఐ నాగస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. 2018 ఫిబ్రవరి 7న రాప్తాడు వైఎస్సార్ ‌సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ ‌రెడ్డి నసనకోట గ్రామంలో పర్యటించి, సూర్యంతో పాటు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. ఆ తర్వాత స్వగ్రామంలో ఉన్న సూర్యంను పరిటాల శ్రీరామ్‌ తన అనుచరులతో వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలుపుతున్నాడనే కారణంతో కిడ్నాప్‌ చేసి నాలుగు రోజుల పాటు విచక్షణారహితంగా దాడి చేసారని తెలిపారు. బాధితుడు సూర్యంతోనే తోపుదుర్తి చంద్రశేఖర్‌ రెడ్డి కిడ్నాప్‌ చేసి దాడిచేసినట్లు అప్పట్లో రామగిరిలో వారు కేసు నమోదు చేశారన్నారు. అనంతరం నసనకోట సూర్యం అనంతపురం వెళ్లి జిల్లా ఎస్పీకి పరిటాల శ్రీరామ్‌ పై ఫిర్యాదు చేయగా.. అప్పట్లో పరిటాల శ్రీరామ్‌ తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఆ సమయంలో కేసు అయితే నమోదు చేసారు కానీ , కేసు విచారణ మాత్రం ముందుకుసాగలేదు. అప్పటి నుండి పెండింగ్ లోనే ఉంది. అయితే ఆ బాధితుడు పలుమార్లు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా, పోలీసులు కేసును మళ్లీ రీ ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు లో అరెస్ట్ చేస్తారేమోనని ముందస్తుగా శ్రీరామ్, టీడీపీ నాయకులు బెయిల్ పొందిన‌ట్టుగా స‌మాచారం. కండీష‌న‌ల్ బెయిల్ ల‌భించ‌గా, ప్ర‌తి మంగ‌ళ‌వారం- శుక్ర‌వారాలు రామ‌గిరి పోలిస్ స్టేష‌న్ కు వెళ్లి సంత‌కాలు పెట్టాల‌నే నిబంధనతో మీద శ్రీరామ్ కు బెయిల్ ల‌భించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకోకపోతే , ఈ మద్యే అరెస్ట్ అయిన టీడీపీ నేతలకి కోర్టులో బెయిల్ రావడం కష్టమైంది. అచ్చెన్న , జేసీ , జేసీ తనయుడు కూడా ఇప్పటికే బెయిల్ కోసం పలుమార్లు కోర్టుని ఆశ్రయించగా ..వారికీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కారణంగానే పరిటాల శ్రీ రామ్ ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకొని , పొందినట్టుగా పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.