Begin typing your search above and press return to search.

అతిపెద్ద సమస్యను చేపట్టిన సీఎం జగన్!

By:  Tupaki Desk   |   31 Aug 2020 1:00 PM GMT
అతిపెద్ద సమస్యను చేపట్టిన సీఎం జగన్!
X
తెలంగాణలో కేసీఆర్ మొదటిసారి గద్దెనెక్కగానే సంక్షేమ పథకాల అమలు కోసం చేసిన ‘సకల జనుల సర్వే’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆ సర్వే తర్వాత కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఇక పోయిన సంవత్సరమే కేసీఆర్ తెలంగాణలోని భూముల లెక్కలు తేల్చి రైతులకు కొత్త పట్టదారు పుస్తకాలు అందజేశారు. అనాదిగా తెలంగాణలో నెలకొన్ని భూ పంచాయితీలకు చెక్ పెట్టి.. ఎవరి భూమి వారికి ఇచ్చి పారదర్శకతకు పెద్దపీట వేశారు.

ఇప్పుడు అదే బాటలో ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడెప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హాయాంలో ఏపీలో 120 ఏళ్ల క్రితం తయారు చేసిన భూరికార్డుల ప్రక్షాళనకు నడుం బిగించారు. సమగ్ర భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. జనవరి 1, 2021 నుంచి ఏపీలో సమగ్ర భూసర్వే చేపట్టి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కరించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

సీఎం జగన్ ఎన్నికల హామీలోనూ భూ సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సమగ్ర భూసర్వేకు పూనుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించారు.సర్వేయర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని డ్రోన్లు, రోవర్లు,సర్వే రాళ్లు ఉపయోగించి భూ సర్వే చేయాలని అధికారులకు జగన్ సూచించారు.

చంద్రబాబు హయాంలో అమరావతి సహా చాలా భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. విశాఖ భూకుంభకోణం, చుక్కల భూముల వ్యవహారం, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ సహా చాలా భూవివాదాలు వచ్చాయి. టీడీపీ గుట్టురట్టు చేయడానికే జగన్ ఈ భూ సమగ్ర సర్వే చేపట్టినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

భూ సమగ్ర సర్వేతో రికార్డులు ప్రక్షాళన చేసి భూ యజమానులకు భరోసా కల్పించడంతోపాటు టీడీపీ నేతల బినామీల గుట్టు రట్టు చేసేలా భూముల సర్వేకు జగన్ శ్రీకారం చుట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది.