Begin typing your search above and press return to search.

దిశ నిందితుల రీపోస్ట్ మార్టమ్ పూర్తి.. మృతదేహాలు ఇప్పుడెక్కడంటే?

By:  Tupaki Desk   |   23 Dec 2019 10:50 AM GMT
దిశ నిందితుల రీపోస్ట్ మార్టమ్ పూర్తి.. మృతదేహాలు ఇప్పుడెక్కడంటే?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచారం ఉదంతానికి సంబంధించిన నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించటం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఫ్రీజర్ బాక్సుల్లో దాచారు. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో రీపోస్టుమార్టం నిర్వహించారు.

ఈ ఉదయమే రీపోస్టుమార్టం ప్రారంభం కాగా.. మధ్యాహ్నం నాటికి పూర్తి అయ్యింది. అనంతరం నాలుగు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. రీపోస్టుమార్టం చేసిన వైద్యులు ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నమే వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా..రీపోస్టుమార్టం పూర్తి అయిన వెంటనే నిందితుల కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పజెప్పారు. వారి.. వారి స్వగ్రామాలకు తీసుకెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి అయినప్పటికీ వారి అంత్యక్రియలు పూర్తి అయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

మృతదేహాలు ఇప్పటికే చెడిపోయిన నేపథ్యంలో ఒక్కరోజు కూడా అంత్యక్రియలు ఆలస్యం చేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితులు మరణించి ఇవాల్టికి 17 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతదేహాలు రాత్రి వేళకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఈ రాత్రికైనా అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు