Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రభుత్వం మీద వైస్ ప్రెసిడెంట్ కి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   22 Jan 2022 9:30 AM GMT
వైసీపీ ప్రభుత్వం మీద వైస్ ప్రెసిడెంట్ కి ఫిర్యాదు
X
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద దేశంలో రెండవ అతి పెద్ద రాజ్యాంగ పదవిలో ఉన్న ఉప రాష్ట్రపతికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం తాజాగా విశాఖ వచ్చారు. లోకల్ గా ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది నాయకులు, ప్రముఖులు ఆయన బస చేసిన చోట కలిశారు.

ఇదే సందర్భంలో తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఉప రాష్ట్రపతిని కలసి ఏపీలో జగన్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు. ఏపీలో మహిళల మీద నేరాలు ఘోరాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని ఆమె ఉప రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె పేర్కొన్నారు.

దిశ చట్టం పేరిట ప్రభుత్వ పెద్దలు మభ్యపెడుతున్నారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ఇక ఏపీలో మహిళల మీద ఎక్కువగా జరుగున్న దాడులలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే బాధితులుగా ఉంటున్నారని కూడా ఆమె పేర్కొనడం విశేషం. ఏపీలో జరుగుతున్న పాలన మీద కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సరైన చర్యలను తీసుకోవాలని అనిత ఉప రాష్ట్రపతిని కోరినట్లుగా తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా దీనికి కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ ఏకంగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నే ఢిల్లీలో కలసి ఏపీ సర్కార్ మీద ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. ఏపీలో శాంతి భద్రతలు బాగా క్షీణించాయని, అందువల్ల రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా రాష్ట్రపతిని కలసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు కోరిన సంగతి తెలిసిందే.

ఇపుడు ఏపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఉప రష్ట్రపతిని కలసి జగన్ సర్కార్ మీద చర్యలు తీసుకోవాలని కోరారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏపీ ప్రభుత్వం మీద టీడీపీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి ఫిర్యాదులు చేస్తూనే ఉంది. అయితే దీని మీద వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది మాత్రం ఎపుడూ చర్చనీయాంశంగా ఉంది. ఇపుడు కూడా అనిత ఫిర్యాదుతో మరో మారు దీని మీద ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతోంది.